
పాత్రికేయులు
భగ్గుమన్న
‘సాక్షి’పై కూటమి ప్రభుత్వ వేధింపులకు నిరసన
డాబాగార్డెన్స్ (విశాఖ)/అనకాపల్లి/నర్సీపట్నం:
‘సాక్షి’ మీడియా సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ జర్నలిస్టులు భగ్గుమన్నారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్న ‘సాక్షి’ గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నంతోపాటు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని మండలాల్లో వివిధ జర్నలిస్ట్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నకిలీ మద్యం దందాను వెలుగులోకి తెచ్చినందుకు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి, నెల్లూరు బ్యూరో ఇన్‌చార్జ్‌కి బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ల కింద పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. నిరసనలో భాగంగా పాత్రికేయులు చేతులకు సంకెళ్లు వేసుకుని, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ‘కూటమి నిరంకుశ పాలన నశించాలి’, ‘అక్షరంపై దాడి సిగ్గు సిగ్గు’, ‘పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీడియాపై అణచివేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని, ఇలాంటి చర్యల ద్వారా జర్నలిజాన్ని భయపెట్టలేరని హెచ్చరించారు. ప్రభుత్వం తన దాష్టీకాన్ని ఆపి, పత్రికా స్వేచ్ఛను గౌరవించాలని డిమాండ్ చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుడు ఎంఆర్‌ఎన్ వర్మ, ఏపీడబ్ల్యూజే నాయకుడు, పి.నారాయణ్, జాతీయ జర్నలిస్ట్‌ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబుతోపాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో..
స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించి, ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ డివిజినల్ అధికారి షేక్ ఆయిషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియో జిల్లా కార్యదర్శి ఆళ్ల వెంకట అప్పారావు, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మళ్ల భాస్కరరావులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. పత్రికల్లో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ప్రచురితమైతే అధికారులు ఖండన ఇవ్వాలే గానీ కక్షపూరితంగా పోలీసులను కార్యాలయాలకు మీదకు పంపడం అన్యాయమన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రతిఘటన తప్పదన్నారు. అనకాపల్లి ప్రెస్ క్లబ్ కార్యదర్శి భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియో అనకాపల్లి అధ్యక్షుడు సీహెచ్ సర్వారావు, వివిధ జర్నలిస్టుల సంఘాల నాయకులు బుద్ద రమణాజీ, కొండలరావు, పి.వీరబాబు, మంత్రి నారాయణమూర్తి, ఆళ్ల రామచంద్రరావు, గంగాధర్, బుదిరెడ్డి మధుసూదనరావు, పెంటకోట సత్యనారాయణ, పెద్దాడ నాయుడు, యడ్ల రామకృష్ణ, బోసు, బొద్దపు కిరణ్, బొడ్డేడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పాత్రికేయులు

పాత్రికేయులు