
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
అనకాపల్లి: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని విద్యుత్ కాంట్రాక్ట్, కార్మిక, ఉద్యోగుల యూనియన్ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ, యునైటెడ్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక గవరపాలెం విద్యుత్ శాఖ ఎస్‌ఈ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని, కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేసిన కార్మికులకు నేరు విద్యుత్ సంస్థ జీతాలు చెల్లించాలని తదిదర డిమాండ్లతో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి.చంద్రశేఖర్, ఆర్.సత్యారావు, కాంట్రాక్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.