
గిరిసీమలో నో సిగ్నల్
నాతవరం: గిరిజన గ్రామాల్లో సెల్‌టవర్లు ఏర్పాటుపై అధికారులు, ప్రజాప్రతినిధుల హామీలు గాలి మూటలుగానే మిగిలాయి. దాంతో ప్రభుత్వ సేవలందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2022లో సరుగుడు, సుందరకోట పంచాయతీల్లో పర్యటించిన అప్పటి కలెక్టరు రవి పట్టాన్‌శెట్టికి, ఇటీవల సుందరకోట పంచాయతీలో గ్యాప్ ఏరియా భూములు పరిశీలనకు వచ్చిన కలెక్టరు విజయకృష్ణన్‌కు గతేడాది నవంబరులో సుందరకోట సభలో స్పీకరు అయ్యన్నపాత్రుడుకు సెల్ టవర్లు లేక పడే బాధలను మొరపెట్టుకున్నారు. ఇంతవరకూ వీరిచ్చిన హామీలు నెరవేరలేదని వాపోతున్నారు. సరుగుడులో బీఎస్‌ఎన్‌ఎల్ టవరు తరుచూ మొరాయిస్తుండటంతో సిగ్నల్స్ రాక ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఒక్కొక్క రోజు గంటలకొద్దీ సిగ్నల్స్ రావడం లేదు. దాంతో ఇక్కడ గ్రామ సచివాలయంలో సకాలంలో పౌర సేవలు అందడం లేదు. ఈ సెల్ టవరు ద్వారా సరుగుడు, సుందరకోట పంచాయతీల పరిధిలో 16 శివారు గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. పింఛన్లతోపాటు నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు అందించాలన్నా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
స్పీకర్ హామీకి అతీగతీ లేదు..
గతేడాది నవంబరు 24వ తేదీన సుందరకోట గ్రామ సభలో అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు దృష్టికి 16 గ్రామాల గిరిజనులు రాజకీయాలకు అతీతంగా ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో తీసుకెళ్లారు. ఇతర గిరిజన గ్రామాల్లో అదనంగా మరో మూడు టవర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలే కాకుండా ప్రైవేటు కార్యక్రమాలు సైతం టవరు పని చేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. దానికి స్పందించి సెల్ టవర్ ఏర్పాటుకు హామీ ఇచ్చినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. సరుగుడు గ్రామ సచివాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదులు వేదికలో ప్రజలు అర్జీలు సమర్పిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేయాలంటే సిగ్నిల్ అందక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కొండలపై ఉన్న 16 గిరిజన గ్రామాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలు, రామన్నపాలెంలో గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ పరమైన సేవలు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి సెల్ టవరు పని చేసేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
మా బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలి
నేను గత కలెక్టరు రవి పట్టాన్‌శెట్టికి ప్రస్తుత కలెక్టరు విజయ కృష్ణన్‌కు సెల్ టవర్ల విషయమై విన్నవించాను. గత ఏడాది నవంబరులో స్పీకరు అయ్యన్నపాత్రుడు సుందరకోట గ్రామానికి వచ్చినప్పుడు సెల్ టవర్లు లేక గిరిజనులు పడుతున్న బాధలు వివరించాను. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలంటే సాంకేతిక అవాంతరాలు ఎదురవుతున్నాయి. సాంకేతిక సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేటికీ పట్టించుకోలేదు. ఇక మేము ఈ సమస్య ఇంకెవ్వరికి చెప్పుకోవాలి.
– సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీపీ, నాతవరం
సెల్ టవర్ల ఏర్పాటుపై
నెరవేరని స్పీకరు అయ్యన్న హామీ
ఇద్దరు కలెక్టర్లకు విన్నవించినా నిరాశే
సరుగుడులో మొరాయిస్తున్న
బీఎస్‌ఎన్‌ఎల్ టవరు
16 గ్రామాల గిరిజనులకు
అందని ప్రభుత్వ సేవలు

గిరిసీమలో నో సిగ్నల్

గిరిసీమలో నో సిగ్నల్

గిరిసీమలో నో సిగ్నల్