
మహాలక్ష్మిగా కనకమహాలక్ష్మి
డాబాగార్డెన్స్(విశాఖ): శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవాలతో ఆధ్యాత్మిక కాంతులీనుతోంది. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు భక్తులను మహాలక్ష్మి అలంకరణలో కటాక్షించారు. పలు రకాల తాజా కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి వేదపండితులు శాస్త్రోక్తంగా సహస్రనామాచార్చన నిర్వహించారు. నగరానికి చెందిన భక్తులు ఒ.నరేష్‌కుమార్, రాధిక కుటుంబ సభ్యులు రూ.45 వేలు చెల్లించి పూజలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గురువారం అమ్మవారు స్వర్ణకవచాలంకరణలో దర్శనమివ్వనున్నారని, 108 స్వర్ణపుష్పాలతో ప్రత్యేక పుష్పార్చన నిర్వహిస్తామని ఈవో శోభారాణి తెలిపారు.
పద్మావతిగా కన్యకాపరమేశ్వరి
డాబాగార్డెన్స్: పాతనగరం కురుపాం మార్కెట్ సమీపంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు బుధవారం కన్యకాపరమేశ్వరి పద్మావతిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన ప్రధాన అర్చకుడు ఆర్‌బీబీ కుమార్‌శర్మచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన వాసవీ కనకదుర్గాదేవికి ప్రత్యేక కుంకుమ పూజలు, హోమం చేశారు. సత్యవతి, వెంకటేశ్వర సుందరకాండ గ్రూప్‌చే సుందరకాండ గానం భక్తులను అలరించింది. గురువారం కన్యకాపరమేశ్వరి విజయదుర్గాదేవిగా దర్శనమివ్వనున్నట్టు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

మహాలక్ష్మిగా కనకమహాలక్ష్మి

మహాలక్ష్మిగా కనకమహాలక్ష్మి