
● పెదగాడిలో యూరియా రగడ ● జీఎస్టీ ప్రచారానికి వస్తే యూరి
యూరియా ఎర
పెందుర్తి: అధికార కూటమి నాయకులు ప్రచార యావతో యూరియాను ఎరగా చూపించి మోసం చేయడంతో ఒక గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంపై అవగాహన సదస్సు కోసం బుధవారం పెందుర్తి మండలం పెదగాడి రైతు సేవా కేంద్రం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఈ వివాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై అవగాహన సదస్సు, ర్యాలీ కోసం పెదగాడి, పినగాడితో పాటు, పినగాడి రెవెన్యూ పరిధిలో భూములు ఉన్న సబ్బవరం మండలం మొగలిపురానికి చెందిన రైతులను కూటమి నాయకులు ఆహ్వానించారు. సదస్సు, ర్యాలీకి వచ్చిన ప్రతీ రైతుకు యూరియా ఇస్తామని నాయకులు నమ్మబలికారు. అసలే యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న మొగలిపురం రైతులు, ఈ హామీతో సదస్సుకు ఉత్సాహంగా హాజరయ్యారు.
తీరా జీఎస్టీపై ప్రచారం పూర్తయిన తరువాత, పెదగాడికి చెందిన కూటమి నాయకులు తమకు నచ్చిన కొందరి పేర్లను అధికారులకు చెప్పి, వారికి మాత్రమే యూరియా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మొగలిపురం రైతులకు పెదగాడి క్లస్టర్‌లో యూరియా ఇవ్వలేమని అధికారులు తేల్చిచెప్పారు.
రైతులు..అధికారుల మధ్య వాగ్వాదం
దీంతో రైతులు, అధికారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మండలం పరంగా సబ్బవరం అయినప్పటికీ, తమ భూములు పినగాడి రెవెన్యూలోనే ఉన్నాయని రైతులు వివరించారు. పినగాడి రెవెన్యూ పరిధిలో ఉన్నవారికి ఇస్తామని చెప్పి, అదే ప్రాంతంలో భూములు ఉన్న తమకు ఎరువు ఇవ్వకపోవడమేంటని నిలదీశారు. అదే సమయంలో యూరియా నిల్వలు కూడా అయిపోవడంతో చేసేది లేక, కూటమి నాయకుల తీరుపై తీవ్రంగా మండిపడుతూ మొగలిపురం రైతులు వెనుదిరిగారు. ‘యూరియా సరిపడా అందించడంలో విఫలమై, చివరకు చిన్నపాటి ప్రచారానికి మాయమాటలు చెప్పి మమ్మల్ని తరలించారు. ఇలా ఉసూరుమనిపించడం తగదు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని వారు స్పష్టం చేశారు.

● పెదగాడిలో యూరియా రగడ ● జీఎస్టీ ప్రచారానికి వస్తే యూరి