
స్పీకర్‌కు చేతనైతే.
మెడికల్ కళాశాల ప్రైవేటుపరం కాకుండా ఆపాలి
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సవాల్
నర్సీపట్నం: స్పీకర్ అయ్యన్నపాత్రుడికి చేతనైతే నర్సీపట్నం మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం కాకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మేలు చేకూరాలనే ఆలోచనతో నాటి సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కళాశాల మంజూరు చేశారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు ఏపీలో 11 మెడికల్ కళాశాలలు ఉండగా మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేశారన్నారు. సుమారు రూ.500 కోట్లతో 630 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టారన్నారు. నిర్మాణం పూర్తయి ఈ కళాశాల ప్రారంభమైతే 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావడమే కాక వేలాది మందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేవన్నారు. మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేయడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకోవటం దురదృష్టకరమన్నారు. ఈ మెడికల్ కళాశాల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిన కళాశాలలో వైద్య ఖర్చులు చెల్లించుకునే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. నర్సీపట్నం మెడికల్ కళాశాల ప్రైవేటుపరం అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసినవారవుతారన్నారు. చేతనైతే మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.