
నాకొద్దు బాబోయ్
● దీర్ఘకాలిక సెలవులో అనకాపల్లి తహసీల్దార్ ● అధికారులపై పెరుగుతున్న రాజకీయ పెత్తనం ● నిబంధనలకు విరుద్ధంగా తాము చెప్పిందే చేయాలంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ● ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవుపై వెళ్లిన తహసీల్దార్
మీ నాయకుల ఒత్తిళ్లు
తట్టుకోలేక
సెలవు పెట్టేశారు
రాజకీయ పెత్తనం పెరగడంతో అధికారులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి భయపడుతున్నారు. ఒత్తిళ్లు భరించలేక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. మ్యుటేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు తాను చెప్పినట్టు జారీ చేయాలని ఒక మాజీ ఎమ్మెల్యే.. రోడ్డు విస్తరణ నిర్వాసితుల్లో తాను చెప్పిన పేర్లు చేర్చమని మరో మాజీ ఎమ్మెల్యే బలవంతపెట్టడంతో నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేయలేక అనకాపల్లి తహసీల్దార్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు.
ఈ ఉద్యోగం
సాక్షి, అనకాపల్లి:
అది సాక్షాత్తూ కలెక్టర్ కొలువుదీరిన జిల్లా కేంద్రం.. తమ సిబ్బంది సాధకబాధకాలు ప్రత్యక్షంగా కనిపించడంతో జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించడం, అండగా నిలవడం సర్వసాధారణం. కానీ అనకాపల్లిలో మాత్రం తహసీల్దార్ అంతటి అధికారి ఒత్తిళ్లు భరించలేక సెలవును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులపై రాజకీయ పెత్తనం పెరిగిందనడానికి తాజా ఉదాహరణ. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా బెదిరింపులకు పాల్పడుతూ టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ శాఖలో వివాదస్పదమైన భూ లిటిగేషన్ పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యుటేషన్లకు సంబంధించి అక్రమాలకు సహకరించడం లేదంటూ నేరుగా తహసీల్దార్‌పైనే టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాను చెప్పిన ఈ పనులు చేయాలని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే తహసీల్దార్‌పై ఇటీవల రెండు వారాలుగా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా చేస్తే తన ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని, చేయలేనని తహసీల్దార్ అప్పారావు చెప్పినట్టు తెలిసింది. దీనికి ఆ మాజీ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయి నానా దుర్భాషలాడారు. ప్రస్తుతం విశాఖ టీడీపీలో జిల్లా స్థాయి పదవిని అనుభవిస్తున్న పెందుర్తి నియోజకవర్గానికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కూడా అనకాపల్లి తహసీల్దార్‌పై మరో విషయంలో ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అనకాపల్లి మండలంలోని కోడూరు గ్రామంలో లే అవుట్ నెం.4కు సంబంధించి 100 అడుగుల రోడ్డు విస్తరణ జరుగుతోంది. భూములు కోల్పోయిన లబ్ధిదారుల జాబితాలో తాను సిఫార్సు చేసిన వారి పేర్లు పొందుపరచాలని మాజీ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. దీనికి నిబంధనలకు అనుగుణంగా ఉంటే చేస్తామని లేదంటే కుదరదని తహసీల్దార్ తోసిపుచ్చారు. గతంలో సర్వే నెంబర్.20లో ఇలానే జరిగిందని, మీరెందుకు ఇవ్వరంటూ ప్రశ్నించి.. మాజీ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయి ‘నీ అంతు చూస్తా.. చేయలేకపోతే సెలవు పెట్టేసి వెళ్లిపో’ అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. దీనికి కలత చెందిన తహసీల్దార్ అప్పారావు సన్నిహితుల వద్ద బోరున విలపించినట్టు సమాచారం. ఎందుకొచ్చిన గొడవ.. రావడమే భయంతో వచ్చాను.. ఇక్కడ నుంచి పోవడం శ్రేయస్కరమని ఆయన సెలవు పెట్టేసి వెళ్లిపోయినట్లు రెవెన్యూ అధికారుల చర్చించుకుంటున్నారు.
41 రోజుల నరకం
తహసీల్దార్ ఎం.బి.అప్పారావును జూన్ నెల 6వ తేదీన అనకాపల్లికి బదిలీ చేశారు. అనకాపల్లిలో విధులు నిర్వహించడం కష్టమని భావించిన అప్పారావు విధుల్లో చేరకుండా 37 రోజులపాటు నిరీక్షించి తప్పనిసరి పరిస్థితుల్లో జూలై 17న బాధ్యతలు స్వీకరించారు. 41 రోజుల పాటు పనిచేసిన అప్పారావు అధికార టీడీపీ చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల హూంకరింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఆగస్టు 28న నెలరోజుల పాటు దీర్ఘకాలిక సెలవు పెట్టారు.
అందరికీ హడలే..
అనకాపల్లిలో నెల రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామి నియమితులై.. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే పదోన్నతిపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి నెల రోజులపాటు డిప్యూటీ తహసీల్దార్ లేరు. ఆ పోస్టు ఖాళీగా ఉండగానే ఆగస్టు 28న తహసీల్దార్ కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయమంతా ఖాళీ అయిపోయింది. సమస్యలపై వచ్చిన వారు సమస్య తీరకుండానే వెనుదిరుగుతున్నారు. ఈ నెల 2వ తేదీన కొత్త డిప్యూటీ తహసీల్దార్‌ను నియమించారు. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయి తహసీల్దార్‌ను నియమించలేదు. భూ సమస్యలు, రికార్డ్ ఆఫ్ రైట్స్ కాపీలు, పాసుబుక్‌లు, కుల, ఆదాయ, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. కొత్త భూ సర్వేలకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అనంతరం మ్యుటేషన్ ప్రక్రియ ఆగిపోయింది. పూర్తిస్థాయి ఎమ్మార్వో లేకపోవడంతో పెండింగ్‌లో పెట్టేస్తున్నారు. ఇక కింది స్థాయి ఉద్యోగులు తమకెందుకు రిస్క్ అంటూ గమ్మున ఉంటున్నారు. పాయకరావుపేట డీటీ ఇక్కడకు బదిలీపై వచ్చినప్పటికీ ఆయన కూడా లోలోపల భయం భయంగానే పనిచేస్తున్నారు. కింది స్థాయి అధికారులు, ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన ఉన్నతాధికారులు మౌనంగా చూసీ చూడనట్టు వ్యవహరించడం తగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.