
ఒడ్డిమెట్టలో నేడు గిరి ప్రదక్షిణ
నక్కపల్లి: జిల్లాలో పేరొందిన నక్కపల్లి మండలం ఒడ్డిమెట్టలో కై లాసగిరిపై కొలువుదీరిన స్వయంభూ లక్ష్మీగణపతి గిరి ప్రదక్షిణ బుధవారం జరగనుంది. గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ముఖ్యనాయకులు, భక్తులు తొలిసారిగా స్వామివారి కొండ చుట్టూ ప్రదక్షిణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక నుంచి ప్రతి ఏటా స్వామివారి కై లాసగిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు వంద సంవత్సరాల క్రితం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఒడ్డిమెట్ట కొండపై స్వామివారు మర్రి చెట్టు తొర్రలో స్వయంభూగా వెలిశానని నామవరానికి చెందిన భక్తుడి కలలో కనిపించి చెప్పడంతో నామవరం, గుంటపల్లి ఒడ్డిమెట్ట తదితర గ్రామాలకు చెందిన పూర్వీకులు చెట్టు కింద తవ్వకాలు జరపగా స్వామివారి విగ్రహం బయపడింది. పక్కనే పందిరి వేసి పూజలు చేయడం ప్రారంభించారు. దాతలు ఇచ్చిన విరాళాలతో ఆలయం నిర్మించడంతో భక్తుల సంఖ్య, ఆదాయం పెరిగింది. దీంతో ఈ ఆలయం దేవదాయ శాఖ పరిధిలోకివెళ్లింది.
సుమారు 3 కి.మీ మేర పాదయాత్ర
ఈ ప్రాంత భక్తులు శుభకార్యాలు తలపెట్టినా, వ్యాపారాలు ప్రారంభించినా, నూతన వాహనాలు కొనుగోలు చేసినా ముందుగా ఒడ్డిమెట్ట గణపతి సన్నిధిలో పూజలు చేయడం ఆనవాయితీ. ప్రతి ఏటా వినాయక చవితినాడు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం జిల్లా నలుమూలల నుంచి తరలివస్తారు. పెద్ద తిరునాళ్లు జరుగుతుంది. ఇంతటి ప్రాచుర్యం పొందిన లక్ష్మీగణపతి స్వయంభూగా వెలసిన కై లాసగిరి ప్రదక్షిణకు భక్తులు శ్రీకారం చుట్టారు. అర్చకులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 5 గంటలకు జాతీయ రహదారి పక్కన ఉన్న స్వామివారి మండపం వద్ద కొబ్బరి కాయ కొట్టి గిరిప్రదక్షిణ ప్రారంభించనున్నారు. ఈ గిరి ప్రదక్షిణ జాతీయ రహదారి, పాతరోడ్డు, గుంటపల్లి రోడ్డు మీదుగా సుమారు 3 కి.మీ. మేర సాగి తిరిగి జాతీయ రహదారిని చేరుకుని మండపం వద్ద ముగుస్తుంది. ప్రదక్షిణ అనంతరం స్వామివారి మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు, దర్శనాలు ఉంటాయని పాలక మండలి చైర్మన్ పైలా నూకన్న నాయుడు తెలిపారు.

ఒడ్డిమెట్టలో నేడు గిరి ప్రదక్షిణ