
రోడ్లు, వంతెనలు నిర్మించాలి..
బుచ్చెయ్యపేట : భీమునిపట్నం,నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో గోతులను పూడ్చి, కూలిన వంతెనలు,దెబ్బతిన్న డైవర్షన్ రోడ్లు నిర్మించి ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించాలని మండల వైఎస్సార్‌సీపీ నాయకులు నిరసనకు దిగారు. మంగళవారం బీఎన్ రోడ్డులో ఏర్పడ్డ పెద్ద పెద్ద గోతులు విజయరామరాజుపేట, వడ్డాదిలో కూలిన వంతెనలు, కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్లు వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు నిరసన చేపట్టారు. వడ్డాది పెద్దేరు వంతెనపైన, విజయరామరాజుపేట తాచేరు వంతెనపైన ఉన్న డైవర్షన్ రోడ్లు కొట్టుకుపోయి నెల రోజులవుతున్న నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అనకాపల్లి, విశాఖ, పాడేరు మూడు జిల్లాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జెడ్పీటీసీ దొండా రాంబాబు, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.అచ్చింనాయుడు తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వర్షాలకు కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్లను నీటి ఉధృతి తగ్గిన వెంటనే యుద్ధ ప్రతిపాదికన వేగవంతంగా పనులు చేపట్టి ప్రయాణికులకు రాకపోకలు సాగేలా చేశామన్నారు. నేడు బీఎన్ రోడ్డులో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే, ఎంపీలు పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. తక్షణం బీఎన్ రోడ్డులో కూలిన వంతెనల నిర్మాణం చేపట్టి కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్లను,గోతులను పూడ్చి ప్రజలకు రవాణా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. వైస్ ఎంపీపీ దొండా లలితా నారాయణమూర్తి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్దనరావు, ఎంపీటీసీ కోరుకొండ లీలావతి రమణ, సర్పంచ్ ఎల్లపు విజయ్‌కుమార్ నాయకులు గుమ్మిడి ప్రసాద్,నమ్మి అప్పలరాజు, జోగా కొండబాబు, గుద్దేటి శ్రీను,గుడాల ఆనంద్, సయ్యపురెడ్డి కొండబాబు, అమ్మునాయుడు, అప్పారావు పాల్గొన్నారు.