
ఆరోగ్య కేంద్రమా.? కూటమి కార్యాలయమా.?
మునగపాక: తిమ్మరాజుపేట ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని కూటమి కార్యాలయంగా మార్చారేమోనన్న సందేహం ప్రస్తుతం అందరిలో కలుగుతోంది. విద్య, వైద్య కేంద్రాల సమీపంలో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు ఉండరాదన్న నిబంధనను తిమ్మరాజుపేటలో కూటమి నాయకులు తుంగలోకి తొక్కేయడంపై విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రం భవనంలో సచివాలయం నిర్వహించేవారు. సచివాలయానికి కొత్త భవనం మంజూరు కావడంతో సంబంధిత భవనాన్ని పంచాయతీ తీర్మానం మేరకు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి కేటాయించారు. కొంత కాలంగా ఈ భవనంలో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు.
అయితే కూటమి నాయకులు మాత్రం ఆరోగ్య ఉపకేంద్రం అని కూడా చూడకుండా ఈ భవనానికి తమ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వామి భక్తిని చాటుకుంటున్నారు. నిరోధించాల్సిన వైద్య సిబ్బంది, మండల అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భవనంపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.