
ఓపెన్‌లో రిజర్వేషన్లతో అన్యాయం
ఆరిలోవ : డీఎస్సీ–2025లో మెరిట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కాల్ లెటర్లు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివి మంచి ర్యాంక్ సాధించినా ఉద్యోగానికి దూరమవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 ప్రకారం వర్టికల్ విధానం అమలుకాలేదని గగ్గోలుపెడుతున్నారు. అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ నుంచి రిజర్వేషన్‌లోకి దించి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. డీఎస్సీ రిజర్వేషన్ల కోటాలో కూటమి ప్రభుత్వం కోత విధించింది. దీంతో బాధిత అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో మంచి ర్యాంకులు సాధించినప్పటికీ మెరిట్ జాబితా ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్ లెటర్లు రాని సుమారు 20 మంది అభ్యర్థులు విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వారంతా అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు. వారికి కాల్ లెటర్లు రాకపోవడంతో వారి వారి ర్యాంకులు, మార్కుల జాబితాతో కూడిన వినతి పత్రాలను జాయింట్ కలెక్టర్‌కు అందించారు. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, జనరల్ కేటగిరీలో ర్యాంకులు సాధించిన వారిని రిజర్వేషన్ కేటగిరీలోకి మార్చడం రాజ్యాంగ విరుద్ధమంటూ నినాదాలు చేశారు. జిల్లాలో ఎస్జీటీ ఓపెన్‌లో 115 పోస్టులు ఉండగా మెరిట్‌లో ఎంపికై న 58 మందిలో 20 మందికిపైగా ఎస్సీ, ఎస్టీలు మంచి ర్యాంకులు సాధించారని.. వారిని ఓపెన్ కేటగిరీ జాబితాలో కాకుండా రిజర్వేషన్ కేటగిరీకి మార్చేశారని.. దీంతో రోస్టర్ ప్రకారం అర్హత కలిగిన 20 మంది రిజర్వడ్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించి కాల్ లెటర్లు పంపలేదని వాపోయారు.