
‘గ్రేటర్’హోదా ఆయన చలువే..
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ‘గ్రేటర్’హోదా కలను వైఎస్సార్ సాకారం చేశారు. 2005 నవంబర్ 22న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ను ‘మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)’గా ఉన్నతీకరించారు. దీంతో నగరం 111 చదరపు కిలోమీటర్ల నుంచి 540 చ.కి.మీలకు విస్తరించి, అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకుంది. 2013లో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలని విలీనం చేయగా 681.96 చ.కిమీ. విస్తరించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మరో 10 పంచాయితీలను గ్రేటర్‌లో విలీనం చేసి.. 98 వార్డులుగా విస్తరించారు. అలాగే జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్నిర్మాణ పథకం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) కింద దేశవ్యాప్తంగా ఎంపికై న 63 నగరాల్లో విశాఖను చేర్చిన ఘనత వైఎస్సార్‌దే. ఆయన చొరవతో ఈ పథకం ద్వారా నగరానికి సుమారు రూ.1,885 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో సింహాచలం–పెందుర్తి బీఆర్‌టీఎస్ కారిడార్లు, ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ (యూజీడీ) వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి.