
సుగర్ ఫ్యాక్టరీల మూసివేత చంద్రబాబు ఘనతే
● గోవాడ సుగర్స్ రైతు బకాయిలు రూ. 30 కోట్లు ● రైతులంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
బుచ్చెయ్యపేట: రాష్ట్రంలో సుగర్ ఫ్యాక్టరీలను మూసి వేసిన ఘనత సీఎం చంద్రబాబుదే అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. మండలంలోని బంగారుమెట్ట గ్రామంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ సుగర్ ఫ్యాక్టరీ(గోవాడ)ని కాపాడుకోలేని స్థితిలో కూటమి సర్కారు ఉందన్నారు. ఈ ఏడాది ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు రూ. 30 కోట్ల వరకు పేమెంట్లు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. నవంబర్‌లో మొదలెట్టాల్సిన గానుగాట జనవరిలో ప్రారంభించి కేవలం లక్షా 8 వేల టన్నుల వరకే క్రషింగ్ చేయడం సిగ్గుచేటన్నారు. ఎనిమిది వేల టన్నుల వరకు పేమెంట్లు చేసి ఇంకా లక్ష టన్నుల వరకు చేయలేదన్నారు. మాడుగుల, చోడవరం సీనియర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లి ఆదుకున్న పాపానపోవడం లేదన్నారు. త్వరలో సుగర్ ఫ్యాక్టరీ మహాజన సభకు ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి రైతులకు సమాధానాలు చెప్పే సాహసం చేయగలరా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులకు ఏమీ చేయలేదని, పరిశ్రమలు రాలేదని చోడవరం ఎమ్మెల్యే ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను మంత్రిగా ఉన్న హయాంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా రూ.89 కోట్లు మంజూరు చేయించి ఫ్యాక్టరీ రైతులకు, ఉద్యోగులకు బకాయిలు చెల్లించామన్నారు.
కూటమి పాలనలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కన్నా ఉన్నవాటిని మూతపడకుండా చేయాలన్నారు. రైతులకు ఎరువులు దొరకని పరిస్థితుల్లో పాలన ఉందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు పాలనలో ప్రకృతి సహకరించక ఆగస్టులోనూ చుక్కనీరు లేక గెడ్డలు, వాగులు ఎండిపోయి రైతులు సాగు చేయలేని దుస్థితిలో ఉన్నారన్నారు. 15 నెలలుగా ప్రజలకు చేసిందేమీ లేకపోయిన పూర్తిస్థాయిలో సూపర్ సిక్స్ అమలు చేశామని కూటమి నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రోడ్లు బాగు చేయని స్థితిలో కూటమి పాలన ఉందని విమర్శించారు. పేదలు, రైతుల సమస్యల పరిష్కారంలో వైఎస్సార్‌సీపీ పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కె. అచ్చింనాయుడు, జెడ్పీటీసీ దొండా రాంబాబు, వైస్ ఎంపీపీలు దొండా లలితా నారాయణమూర్తి, గొంపా చినబాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్దనరావు, జిల్లా కార్యదర్శి జోగా కొండబాబు తదితరులు పాల్గొన్నారు.