
అంధకారం.. తాండవం.!
● తాండవ ప్రాజెక్టుపై కానరాని విద్యుత్ వెలుగులు ● కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేయని లైట్లు
నాతవరం: జిల్లాలో ఏకై క మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. విద్యుత్ దీపాలు పాడైనా మరమ్మతులు చేపట్టే నాథుడు కరువయ్యారు. ఈ నెల 10న ఖరీఫ్ పంట సాగు కోసం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడానికి నిర్ణయించారు. నీటి విడుదలకు స్పీకరు అయ్యన్నపాత్రుడు రానుండడంతో తాత్కాలికంగా ప్రాజెక్టుపై రెండు లైట్లు ఇటీవల ఏర్పాటు చేశారు. తాండవ ప్రాజెక్టు ఒక వైపు రైతులకు సాగునీరు సరఫరా చేస్తుంది.. మరో వైపు నిత్యం సందర్శకులకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. తాండవ రిజర్వాయరు నీరు ఆధారంగా ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, పాయకరావుపేట, కాకినాడ జిల్లా తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలో 52 వేల ఎకరాలు సాగవుతున్నాయి. రెండు కొండల నడుమ సుందరంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు అందాలు తిలకించేందుకు రెండు జిల్లాలు నలుమూలలు నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో తాండవ ప్రాజెక్టు పరిసరాలు మరింత సందడిగా కనిపిస్తాయి. అంత ప్రాధాన్యం ఉన్న తాండవ ప్రాజెక్టుపై విద్యుత్ వెలుగులు కానరాక అంధకారం అలముకుంటోంది.
తాండవ ప్రాజెక్టుపై గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు పాడైపోయాయి. వాటికి మరమ్మతులు చేపట్టకుండా వదిలేశారు. గతంలో తాండవ ప్రాజెక్టుపై స్పీల్‌వే గేట్ల వద్ద మొత్తం 40 నుంచి 50 లైట్లు వరకు ఉండేవి. ఈ దీపాల వెలుగుల్లో రాత్రి వేళ తాండవ రిజర్వాయరు ప్రాంగణమంతా చూడముచ్చటగా కన్పించేది. ప్రస్తుతం లైట్లు పూర్తిగా పాడైపోవడంతో సాయంత్రం అయ్యేసరికి చిమ్మ చీకటిలో తాండవ ప్రాజెక్టు కనిపిస్తోంది. చుట్టూ కొండలు కావడంతో విద్యుత్ వెలుగులు లేక చీకటి పడేసరికి భయానక వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సందర్శకులు పొద్దుపోక ముందే తిరుగు ముఖం పడుతున్నారు.
రాత్రి వేళ సెల్‌ఫోన్ల వెలుగులో
నీటి మట్టం పరిశీలన
తుఫాన్లు, వర్షాల సమయంలో తాండవ ప్రాజెక్టులో ప్రమాదస్థాయి నీటి మట్టం పెరిగినప్పుడు నీటి నిల్వలు రాత్రి వేళల్లో చూసేందుకు సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో నీటి మట్టం పరిశీలించే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాండవ ప్రాజెక్టు ప్రధాన గేట్ల నుంచి స్పిల్‌వే గేట్ల మధ్య దూరం రెండు కిలోమీటర్లు ఉంటుంది. తాండవ ప్రాజెక్టు ప్రమాద స్థాయి నీటి మట్టాన్ని నివారించాలంటే స్పీల్‌వే గేట్లు ఎత్తి నీటిని నదిలోకి విడుదల చేయాలి. స్పీల్‌వే గేట్ల వద్ద విద్యుత్ లైట్లు పూర్తిగా వెలగడం లేదు. ఇక్కడ పరిస్థితి రాత్రి సమయంలో చాలా దారుణంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం తాండవ ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రాధ్యాన్యత ఇచ్చింది తప్ప శిథిలమైన లైట్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి ప్రాజెక్టు పరిసరాల్లో విద్యుత్ దీపాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నారు.
ప్రతిపాదనలు చేశాం..
తాండవ ప్రాజెక్టుపై విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసేందుకు నిధులకు ప్రతిపాదనలు చేశాం. అంధకారాన్ని నివారించేందుకు ఇటీవల రెండు లైట్లు వేశాం. మిగతా లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం. సిబ్బంది కొరత కారణంగా తాండవ ప్రాజెక్టుపై పర్యవేక్షణ లేదు. నీటి మట్టం పరిశీలించే వద్ద స్పిల్‌వే గేటు వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తాం. ఇటీవల విడుదలైన నిధులతో తాండవ కాలువలో పూడిక తీత పనులు చేస్తున్నాం.
– అనురాధ, డీఈ, తాండవ ప్రాజెక్టు

అంధకారం.. తాండవం.!

అంధకారం.. తాండవం.!