
● బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటుపై నేడు ప్రజాభిప్రాయ సేకర
నక్కపల్లి: మూడు రాష్ట్రాలతో పోటీపడి సాధించిన బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ బుధవారం జరగనుంది. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రజాభిప్రాయ సేకరణకు విస్తృత ఏర్పాటు జరుగుతున్నాయి. 200మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మండలంలో రాజయ్యపేట సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ బల్క్‌డ్రగ్ పార్క్ వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, ప్రజల ప్రాణాలను హరించే ఈ ప్రమాదకరమైన బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయవద్దంటూ మత్స్యకారులు, పార్క్ ప్రభావిత ప్రాంతాల వారు ఆందోళన చేస్తున్నారు. పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు, ప్రాజెక్టు గురించి వివరించి ఇక్కడ ఏయే పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి, ప్రజల జీవన విధానానికి నష్టం వాటిల్లకుండా తీసుకునే చర్యల గురించి అధికార యంత్రాంగం వివరించి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది.
అదనపు భూసేకరణపై నిరసనలు
బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం రాజయ్యపేట, చందనాడ, బోయపాడు, అమలాపురం, బుచ్చిరాజుపేట, పాటిమీద, మూలపర గ్రామాల్లో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో 2 వేల ఎకరాలు కేటాయించారు. ఇది చాలదన్నట్లు పెదతీనార్ల, జానకయ్యపేట, సిహెచ్‌ఎల్ పురం, ఎస్.రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామాల్లో మరో 800 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలను హరించే బల్క్‌డ్రగ్ పార్క్ రద్దు చేయాలని బుధవారం నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామంటూ ప్రభావిత గ్రామాల వారు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా భూములు ఇచ్చేది లేదని, పార్క్ ఏర్పాట్లను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా పాదయాత్రలు, ధర్నాలు, తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి వంటి కార్యక్రమాలు చేస్తున్నారు.