
రైతుల పాలిట కాలకూటమి
అనకాపల్లి : దేశానికి అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచిందని..ఏడాది కాలంలో రైతులు అప్పులు చేసుకుని వ్యవసాయం చేసే పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, ఏడాదిగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయలేదు..ఈ ఏడాది కూడా కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి సరిపెట్టారు. మిగిలిన రూ.15 వేలు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జిల్లాలో సుమారు 24 వేల మంది లబ్దిదారుల్లో కోత విధించారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరత నివారించాలంటూ సోమవారం వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీఫ్ సీజన్‌కు సచివాలయంలో అగ్రికల్చర్ కార్యదర్శితో గ్రామంలో రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలతో పాటు రైతు భరోసా సకాలంలో రైతుల బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు గతంలో రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే దండగ అని రైతులను కించపరిచారని అన్నారు. రాష్ట్రంలో జీఎస్‌డీపీ 40 నుంచి 42 శాతం ఉండేదన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు నేటి వరకూ కావలసిన ఎరువులు, యూరియా, భూసార పరీక్షలు చేయలేదన్నారు. భూసారాన్ని బట్టి వైఎస్సార్‌సీపీ పాలనలో సచివాలయం అగ్రికల్చర్ కార్యదర్శి ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, వరినాట్లు వేసే సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయశాఖ అధికారులు ఖరీఫ్ సీజన్ పంటలపై దృష్టి సాధించాలని హితవు పలికారు. రైతులకు గిట్టుబాటు ధర వైఎస్సార్‌సీపీ పాలనలో కల్పించడం జరిగిందని, కూటమి పాలనలో రైతుల సమస్యలు పట్టించుకోనే నాయకుడు కనిపించడం లేదన్నారు. మొద్దు నిద్రలో కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందన్నారు.
కార్యక్రమంలో వివిధ నియోజకవర్గ సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కంబాల జోగులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పట్టణ, మండలపార్టీ అధ్యక్షులు మందపాటి జానకీరామరాజు, పెదిశెట్టి గోవింద్, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మొద్దునిద్రలో కూటమి ప్రభుత్వం..అప్పుల ఊబిలో అన్నదాతలు
గతేడాది అన్నదాత సుఖీభవ లేదు..ఈ ఏడాది 24 వేల మంది లబ్ధిదారుల కోత
ఇచ్చింది రూ.5వేలే..మిగిలిన రూ.15 వేలు ఎప్పుడిస్తారో..?
మండిపడిన వైఎస్సార్‌సీపీ నేతలు
ఎరువుల కొరతపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు
హాజరైన మాజీ మంత్రులు అమర్‌నాథ్, ముత్యాలనాయుడు, సమన్వయకర్తలు

రైతుల పాలిట కాలకూటమి