
న్యాయమూర్తి చొరవతో నిర్వాసితులకు న్యాయం
నిర్వాసితులకు చెక్కులు అందజేస్తున్న న్యాయమూర్తి షియాజ్‌ఖాన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం, రాచపల్లి సమీపంలో ఉన్న అన్‌రాక్ కంపెనీకి భూములు ఇచ్చిన 21 మంది నిర్వాసితులకు నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్‌ఖాన్ చొరవతో న్యాయం జరిగింది. 2016 నుంచి నష్టపరిహారం కోసం నిర్వాసితులు పోరాడుతున్నారు. అయినా ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడంతో బాధిత రైతులు న్యాయస్థానానికి, మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి షియాజ్ ఖాన్‌కు ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి విచారణ జరపడంతో యాజమాన్యం నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. సోమవారం న్యాయమూర్తి సమక్షంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత, ఏపీఐఐసీ విశాఖపట్నం, అన్‌రాక్ కంపెనీ యాజమాన్యం నిర్వాసితులకు పరిహారం సొమ్ము చెక్కులను అందజేశారు. నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తూ న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు.