
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ట్రోఫీ ఆవిష్కరణ
మునగపాక: క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం అందరిపైనా ఉందని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని నాగులాపల్లిలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి మహిళలు, పురుషుల కబడ్డీ పోటీల ట్రోఫీని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీకి ఎంతో ఆదరణ ఉందన్నారు. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు. కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఎమ్మెల్యే విజయకుమార్ జన్మదిన సందర్భంగా నాగులాపల్లిలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పెద్దలు టెక్కలి పరశురామ్, శరగడం యోగి నాగేశ్వరరావు, పొలమరశెట్టి మురళి, ఆడారి గణేష్, ఆడారి ఆనంద్ సన్యాసినాయుడు, ఆడారి జగన్నాథరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా టెక్నికల్ కోచ్‌లు గణపతి, శివ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.