
ఆదివాసీ హక్కుల దినోత్సవంగా మార్చాలని ధర్నా
ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఏపీ ఆదివాసీ సంఘ నాయకులు
నర్సీపట్నం: ఏటా ఆగస్టు 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ హక్కుల దినోత్సవంగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆదివాసీ సంఘం నాయకులు సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆదివాసీ సంఘం నాయకులు కె.జనార్దన్, మోసూరి రాజు మాట్లాడుతూ నాన్ షెడ్యూల్ ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించాలని 1977లోనే ఏపీ మంత్రివర్గం తీర్మానం చేసినా, నేటికి అమలుకు నోచుకోలేదన్నారు. ఆదివాసీల స్వాధీన అనుభవంలో ఉన్న భూములను గుంజుకోవడానికి భూ మాఫియా దాడులు చేస్తుందన్నారు. ఆదివాసీల భూములకు రక్షణ కల్పించాలన్నారు. ఆదివాసీల సాగులో ఉన్న అటవీ, ప్రభుత్వ బంజరు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు.