
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం వివాహితుల ధర్నా
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్, మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ల ఏర్పాటు కోసం నివాస ప్రాంతాలను ఇచ్చిన కుటుంబాల్లో పెళ్లయిన ఆడవాళ్లకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింజేయాలంటూ పలువురు వివాహితులు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మండలంలోని చందనాడ, తమ్మయ్యపేట, మూలపర, పాటిమీద, తుమ్మలపేట, తదితర గ్రామాలకు చెందిన పలువురు వివాహితులు ఇక్కడకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2014లో భూసేకరణ సమయంలో ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఆ సమయంలో నిర్వాసిత కుటుంబాల్లో వివాహం కాని ఆడవారికి మేజర్లయిన ఆడ, మగవారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తామంతా జిరాయితీ భూముల్లో ఇళ్లను కంపెనీల కోసం ఇవ్వడానికి ఒప్పుకున్నామన్నారు. తీరా ఇప్పుడు పెళ్లయిన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడం లేదన్నారు. ప్యాకేజీ కింద ఐదు సెంట్ల ఇల్ల స్థలం, రూ.8.98 లక్షలు చొప్పున వివాహం కాని ఆడవారికి కుటుంబ యజమానికి మేజర్లయిన మగ పిల్లలకు మాత్రమే ఇస్తున్నారన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసి పదేళ్లు గడిచిందన్నారు. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలను ఎన్నాళ్లు ఇళ్లలో ఉంచుకుంటారని, అప్పులు చేసి వివాహాలు చేస్తే, ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ నినాదాలు చేశారు. వివాహమైన ఆడపిల్లలకు కూడా ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. ఈ ఆందోళనలో సీపీఎం నాయకులు అప్పలరాజు, మనబాల రాజేష్, చంటమ్మ, తుమ్మల భవానీ, శిరీషా, ఉప్పలూరి మానస, అశ్విని దుర్గ, నాగదుర్గ, రావి హైమావతి తదితరులు పాల్గొన్నారు.