
ప్రత్యేక ఉపాధ్యాయుడికి ఘన సత్కారం
మహాలక్ష్మినాయుడును సన్మానిస్తున్న సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ జయప్రకాష్
రావికమతం : జాతీయ స్థాయి దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్ భారత్ బోసిబాల్ క్రీడా పోటీల్లో రాష్ట్ర విద్యార్థులు ఆరు పతకాలు సాధించేందుకు కృషి చేసిన కోచ్ మేడివాడ హైస్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్, ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మినాయుడును పలువురు అభినందించారు. ఆయనను అనకాపల్లి జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ జయప్రకాష్, జిల్లా సహిత విద్య సమన్యకర్త వి.ఆర్ కృష్ణంనాయుడు, చిన గుమ్ములూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బి.శకుంతల శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రశంసాపత్రం అందజేశారు. గత నెల 24 నుంచి 28 వరకూ చత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పాయి యూనివర్శిటీ స్టేడియంలో జరిగిన బోసి బాల్ గేమ్‌లో రాష్ట్రం నుంచి ఆరుగురు పాల్గొనగా, ఒకరికి బంగారు పతకం, ఇద్దరికి రజత, ముగ్గురికి కాంస్య పతకాలు రావడంలో ప్రత్యేక ఉపాధ్యాయుడి కృషి అభినందనీయమని అన్నారు.
మూడు దశల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు
మహారాణిపేట: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మూడు దశల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని, దేశభక్తి భావజాలాన్ని ప్రజల్లో నింపే విధంగా విస్తృత ప్రచార క్యాంపెయిన్లు నిర్వహించాలని సూచించారు. పౌరులు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయుట, ర్యాలీలు చేపట్టడం, ఇతర కార్యక్రమాల నిర్వహణలో ప్రోత్సాహం అందించాలని చెప్పారు. మొదటి దశ ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు, రెండోది 9 నుంచి 12వ తేదీ వరకు, 13 నుంచి 15వ తేదీ వరకు మూడో దశల్లో కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
తిరంగతో సెల్ఫీ, ప్రభాత్–ఫెరిస్, తిరంగ ర్యాలీలు, తిరంగ ప్రదర్శనలు, ఇతర అట్టడుగు స్థాయి జనభాగీదారీ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. సెల్ఫీలను www.harghartiranga.com వెబ్ సైట్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చని సూచించారు. అధికారులు, ప్రజలు హర్ ఘర్ తిరంగా వేడుకల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.