
డెంగ్యూ, మలేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు
● కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వెయ్యాలని, కాలానుగుణ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా చేపడుతున్న అనేక సేవలపై అధికారులతో సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఎస్‌డబ్ల్యూపీసీ, షెడ్లు, గ్రామీణ నీటి సరఫరా, జీఎస్‌డబ్ల్యూఎస్ సర్వే, గృహ నిర్మాణం, పంచాయతీ రాజ్, డ్వామా శాఖలపై, సూర్య ఘర్, ఉపాధి హామీ అంశాలపై సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న సర్వేలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. గిరి శిఖర గ్రామాల్లో మంచినీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. గోకులం షెడ్డులను త్వరితగతిన పూర్తి చెయ్యాలన్నారు. రెండు ఆవులను స్వయం సహాయక బృందాల ద్వారా లోన్ ఇప్పించుటకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసి చెత్త సంపద సృష్టి కేంద్రానికి పంపించే ఏర్పాటు చెయ్యాలన్నారు. ప్రతి గ్రామంలో సూర్య ఘర్ యోజన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. జిల్లాలో 5 సోలార్ గ్రామాలతోపాటు మిగిలిన అన్ని గ్రామాల్లో సొలర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చెయ్యాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నారాయణ మూర్తి, డ్వామా పీడీ పి.పూర్ణిమాదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఏఎస్‌ఏ రామస్వామి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హైమావతి, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ ప్రసాద్, డీపీఆర్సీ జిల్లా కో ఆర్డినేటర్ నాగలక్ష్మి, జిల్లా గ్రామ వార్డు సచివాలయల అధికారి మంజులవాణి, పంచాయతీరాజ్ డీఈలు, జేఈలు పాల్గొన్నారు.