
అదనపు భారం మోపొద్దని నిరసన
● అధికారులకు సెల్‌ఫోన్లు సరెండర్ చేసిన అంగన్‌వాడీలు
నక్కపల్లి : ప్రధానమంత్రి మాతృ వందన యోజన వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేయాలని అదనపు బాధ్యత అప్పజెప్పడంపై అంగన్‌వాడీ సిబ్బంది ఆందోళన చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్‌లను సోమవారం నక్కపల్లి ఐసీడీఎస్ కార్యాలయంలో సరెండర్ చేశారు. వాటితోపాటు సిమ్ కార్డులను వెనక్కి తిరిగి ఇచ్చేసారు. అంగన్‌వాడీ వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు దుర్గారాణి మాట్లాడుతూ 2జి రామ్‌తో 4జి నెట్‌వర్క్‌తో ఉన్న ఈ ఫోన్లను ఐదేళ్ల క్రితం అందజేశారన్నారు. ప్రస్తుతం 5జీ ఫోన్లలో మాత్రమే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన యాప్‌లు ఇన్‌స్టాల్ అవుతున్నాయన్నారు. తక్కువ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ ఫోన్‌ల ద్వారా లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్ చేయడం సాధ్యం కావడం లేదన్నారు. 5జీ టెక్నాలజీ కలిగిన ఫోన్‌లు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అంగన్‌వాడీ సిబ్బందికి ట్యాబులు సరఫరా చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఏడాది పూర్తయినా హామీ నెరవేర్చలేదన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మారుస్తామని హామీ ఇచ్చారని ఇంతవరకు జీవో విడదల చేయలేదన్నారు. ఐసీడీఎస్ పరిధిలో 309 మొబైల్ ఫోన్‌లను ఐసీడీఎస్ కార్యాలయంలో సరెండర్ చేశామన్నారు.