
పరిహారం ఇవ్వలేదని రైతు మనస్తాపం
● బలవంతంగా పాకల తొలగింపుతో గుండెపోటు మృతి ● కృష్ణపాలెంలో విషాదఛాయలు
రాంబిల్లి(అచ్యుతాపురం): పరిశ్రమల ఏర్పాటు కోసం రైతులు సాగు చేసే భూముల సేకరణ, జీవన భృతినిచ్చే పశువుల పాకలను బలవంతంగా తొలగించారనే వేదనతో ఓ రైతు మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన ఘటన రాంబిల్లి మండలంలో చోటు చేసుకుంది. కృష్ణంపాలెం గ్రామస్తులు, మృతుని భార్య వరహాలమ్మ అందించిన వివరాలిలా ఉన్నాయి. రాంబిల్లి మండలం కృష్ణంపాలెం శివారు గ్రామాల్లో ఉన్న భూముల్ని ఏపీఐఐసీ సేకరించింది. ఇటీవల అదనపు కర్మాగారాల స్థాపన కోసం గతంలో సేకరించిన భూముల్లో పశువులు పాకల్ని తొలగించే ప్రక్రియ చేపట్టారు. అయితే సర్వే బృందం ఇచ్చిన నివేదిక మేరకు అర్హులను గుర్తించడంలో పక్షపాతం చూపించారని ఇప్పటికే ఆ గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
కళ్ల ముందు పాకల్ని తొలగించడం చూసి..
కృష్ణంపాలెంకు చెందిన రైతు కుప్ప పైడియ్య(63) పశువుల పాకల్ని, ఇతరత్రా జీవన భృతికి దోహదపడే చెట్లను ఎటువంటి పరిహారం ఇవ్వకుండా తొలగించారు. తమకు న్యాయం జరగలేదని, కుటుంబానికి ఆధారం లేకుండా చేశారని మదనపడిన పైడియ్య సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందారు. తమకు న్యాయం చేయా లని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న కంపెనీ సిబ్బంది దురుసు ప్రవర్తన కారణంగా తన భర్త మృతి చెందారని వరహాలమ్మ, కుమారుడు గణేశ్ కన్నీరుమున్నీరుగా విలపించారు. అభివృద్ధి పేరిట ప్రజల జీవన భృతిని దూరం చేసి ఆదుకోకపోవడం అన్యాయమని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.