
ఆ జీవో విద్యార్థుల గొంతు నొక్కేందుకే..!
● విద్యాశాఖ ఉత్తర్వులు వెనక్కితీసుకోవాలి ● ఉత్తర్వుల కాపీని దహనం చేసిన ఎస్‌ఎఫ్‌ఐ
బీచ్‌రోడ్డు: పాఠశాలల్లో విద్యార్థుల స్వేచ్ఛను, ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ఉన్న విద్యాశాఖ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉత్తర్వుల ప్రతులను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్.జె. నాయుడు మాట్లాడుతూ పాఠశాల విద్యా కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు విద్యార్థులు తమ సమస్యలను బయటకు తెలియజేసే అవకాశాన్ని లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధమని, విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నమేనన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లే విద్యార్థి సంఘాలకు అనుమతి లభించదని, దీనివల్ల విద్యార్థుల సమస్యలు బయటకు రాకుండా పోతాయన్నారు. ప్రైవేటు పాఠశాలల దోపిడీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.