
అంగన్‌వాడీ పోస్టు తారుమారుపై కౌన్సిల్‌లో చర్చకు కృషి
● దళిత మహిళ సునీతకు ధర్మశ్రీ హామీ ● తిమ్మరాజుపేటలో దీక్ష శిబిరం సందర్శన
అచ్యుతాపురం రూరల్ : తిమ్మరాజుపేటలో గత 20 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న దళిత మహిళ మంత్రి సునీతను సోమవారం వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పరామర్శించారు. తనకు రావల్సిన అంగన్‌వాడీ పోస్టును తారుమారు చేశారని ఆరోపిస్తూ ఆమె చేపట్టిన దీక్ష శిబిరాన్ని ధర్మశ్రీ సందర్శించి సంఘీభావం తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని, ఇప్పటి వరకూ వస్తున్న బెదిరింపుల విషయంపై ఆయనకు సునీత వివరించారు. తనకు న్యాయం చేయాలంటూ ధర్మశ్రీకి ఆమె వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన ఆయన.. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, తదితర పార్టీ పెద్దలతో మాట్లాడి వచ్చే కౌన్సిల్ సమావేశంలో చర్చించి, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని ఆమెకు ధర్మశ్రీ సూచించారు.