
పెళ్లింట విషాదం
● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి
కశింకోట: మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ ఒక్కగానొక్క కుమారుడిని ఓ ఇంటి వాడిని చేసి తమ ముచ్చట తీర్చుకుందామన్న ఆ తల్లిదండ్రులకు తీవ్ర గర్భశోకం మిగిలింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృత్యువుతో పోరాటం చేసి చివరికి తుది శ్వాస విడిచాడు. మండలంలోని చింతలపాలెం గ్రామానికి చెందిన యువకుడు గురువారం విశాఖ కేజీహెచ్‌లో మృతి చెందాడు. సీఐ అల్లు స్వామినాయుడు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుదిరెడ్డి నాగేశ్వరరావు (30) పరవాడ వద్ద ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కంపెనీలో విధులకు వెళ్లడానికి ఈ నెల 22న తమ గ్రామంలో రోడ్డు దాటుతుండగా అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడటంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 30న వివాహం జరగాల్సి ఉండగా...
మృతుడు నాగేశ్వరరావు తమ తల్లిదండ్రులు అప్పలనాయుడు, పార్వతి దంపతులకు మగ సంతానం ఒక్కరే. ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లయింది. తాజాగా మృతుడు నాగేశ్వరరావుకు వివాహం నిశ్చయమైంది. ఈ నెల 30న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మృత్యువాత పడ్డాడు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట ఈ సంఘటన చోటు చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.