
ఒత్తిడి లేని జీవనానికి ధ్యానం
పాయకరావుపేట: ఒత్తిడి లేని జీవనానికి ధ్యానం అవసరమని యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు స్వామిశ్రీ స్మరణానంద గిరి తెలియజేశారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఆయన ఉద్బోధించారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు ఏకాగ్రత పెంపొందించుకోవడానికి ధ్యానం ఒక మార్గమని సూచించారు. ధ్యాన సాధనను ఎలా లోతుగా చేసుకోవాలో వివరించారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా యోగా, ధ్యానం ద్వారా మనసులో ఉండే భయాలు తొలగిపోతాయన్నారు. అజ్ఞానం అనే అంధకారం తొలగించుకోవడానికి ధ్యానం ఒక మార్గమన్నారు. నిద్ర ద్వారా వచ్చే విశ్రాంతి, శక్తి కన్నా ధ్యానం ద్వారా ఎక్కువ విశ్రాంతి పొందుతామన్నారు. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి అనునిత్యం పుస్తక పఠనం తప్పనిసరి అని సూచించారు. కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్‌ప్రకాష్, యోగద సత్సంగ ధ్యాన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.