వైజాగ్‌ మెట్రోకి టెండర్లు | - | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ మెట్రోకి టెండర్లు

Jul 26 2025 10:22 AM | Updated on Jul 26 2025 10:22 AM

వైజాగ్‌ మెట్రోకి టెండర్లు

వైజాగ్‌ మెట్రోకి టెండర్లు

● ఫేజ్‌–1లో 46.23 కిమీకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ● డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం తెలపకుండానే టెండర్లు పిలవడంపై విమర్శలు ● కేంద్రం నిధులు ఇస్తుందా లేదా అనేదానిపైనా నీలినీడలు ● గొప్పల కోసమే కూటమి ప్రభుత్వం టెండర్ల హడావిడి ● వీఎంఆర్డీఏ నిధులు మెట్రోకి మళ్లించే ప్రయత్నం ● ఇప్పటికే ఆదాయం లేక కునారిల్లుతున్న వీఎంఆర్డీఏ ● తాజా నిర్ణయంతో మరింత ఆర్థిక భారం

డీపీఆర్‌ ఆమోదం లేకుండా టెండరు..

నిధుల్లేకుండా హడావుడి

సాక్షి, విశాఖపట్నం: డీపీఆర్‌కు ఆమోదం చెప్పలేదు.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి విదిల్చలేదు.. భూ సేకరణకు కూడా అడుగు పడలేదు.. కనీసం మా వంతు సహకారం అందిస్తామన్న హామీ కూడా రాలేదు. కానీ.. కూటమి ప్రభుత్వం ప్రచారం కోసం హడావిడి ప్రారంభించేసింది. రూపాయి లేదు.. డీపీఆర్‌ లేదు.. కొడుకు పేరు వైజాగ్‌ మెట్రో అన్నట్లుగా.. ప్రజల్ని మభ్య పెట్టేందుకు వైజాగ్‌ మెట్రో నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఫేజ్‌–1లో 46.23 కిమీ నిర్మించేందుకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) దాదాపు రూ.6500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక ఫ్లైఓవర్‌ నిర్మాణానికే రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. కానీ.. 42 ఎలివేటెడ్‌ మెట్రో స్టేషన్లతో కూడిన 46.23 కిమీ మెట్రో ప్రాజెక్టు అగ్రిమెంట్‌ అయిన 30 నెలల్లో పూర్తి చేసెయ్యాలంటూ నిబంధనలు విధించింది. ఈ ప్రాజెక్టు కోసం వీఎంఆర్‌డీఏని ఆర్థికంగా బలి చేసేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయించింది.

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూ.6250 కోట్లు(జీఎస్‌టీ అదనం)తో టెండర్లుకు శుక్రవారం ఆహ్వానించింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.11,498 కోట్లు కాగా..మూడు కారిడార్లలో ఫేజ్‌ –1 పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్‌సీ టెండర్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ పనుల్ని మూడేళ్ల కాలపరిమితితో పూర్తి చేయాలని టెండర్‌ షెడ్యూలులో పేర్కొన్నారు. టెండర్‌ సమర్పించిన 180 రోజుల వరకూ బిడ్‌ వ్యాలిడిటీ ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టును మొత్తం 140.13 కి.మీ లో చేపట్టనున్నారు. తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర చేపట్టనుండగా.. ఇందులో మొత్తం 42 ఎలివేటెడ్‌ మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఇందులో 20.16 కి.మీ డబుల్‌ డెక్కర్‌ తరహాలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్‌ప్లాంట్‌ వరకూ పై వంతెనలు నిర్మిస్తారు. కొమ్మాది– స్టీల్‌ప్లాంట్‌, గురుద్వారా–పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం–చినవాల్తేరు కారిడార్లలో తొలి దశ కింద మెట్రోకు ప్రణాళిక చేశారు. కొమ్మాది–స్టీల్‌ప్లాంట్‌ మధ్య ఏర్పాటు చేసే 34.40 కిలోమీటర్ల కారిడార్లో డబుల్‌ డెక్కర్‌ ట్రాక్‌ నిర్మించనున్నారు. అలాగే మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కిమీ మేర రెండో కారిడార్‌ను నిర్మిస్తారు. గాజువాక నుంచి స్టీల్‌ప్లాంటు మధ్య మరొక కారిడార్‌ ఏర్పాటు చేయనున్నారు.

30 నెలల్లో పూర్తి చెయ్యాలంట..

ఈ నెల 28న ఏపీ ఈప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పెట్టనున్నారు. సెప్టెంబర్‌ 12న టెండర్లు ఓపెన్‌ చెయ్యనున్నారు. అనంతరం వడపోత తర్వాత.. టెండర్‌ దక్కించుకున్న సంస్థతో అగ్రిమెంట్‌ కుదుర్చుకుంటారు. ఆ తర్వాత 30 నెలల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలని షరతు విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కిలోమీటర్‌ ఫ్లైఓవర్‌ పూర్తి చేసేందుకు రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. కానీ.. కూటమి ప్రభుత్వం మాత్రం 46 కిమీ మెట్రో ప్రాజెక్టు రెండున్నరేళ్లలోనే పూర్తి చేసెయ్యాలని చెప్పడం చూస్తే.. ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టి.. ప్రచారం కోసమేనన్నట్లుగా అర్థమవుతోంది. అదేవిధంగా.. డబుల్‌ డెక్కర్‌ నాలుగు లైన్ల ఫ్లై ఓవర్‌ని కూడా 24 నెలల్లో పూర్తి చేసేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

ఒక్క అడుగు కూడా పడకుండానే..!

ఒక ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ని కేంద్రం ఆమోదించాలి.. నిధులు చూపించిన తర్వాతే.. టెండర్లకు వెళ్తుంటారు. కానీ.. వైజాగ్‌ మెట్రో విషయంలో మాత్రం తిమ్మిని బమ్మి చేసేస్తున్నారు. రాష్ట్ర కేబినెట్‌ డీపీఆర్‌ని ఆమోదించి.. కేంద్రానికి పంపించింది. నెల రోజుల క్రితం కూటమి ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి.. డీపీఆర్‌ అమోదించాలని కోరారు. కానీ.. ఇంతవరకూ డీపీఆర్‌ని ఆమోదించలేదు. అంతే కాదు.. విభజన చట్టంలో భాగంగా.. మెట్రోకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. కానీ.. ఇంతవరకూ మెట్రో కోసం నిధులు మంజూరు చేస్తామని కేంద్రం ప్రకటించలేదు. రెండు ఫేజ్‌లలో మెట్రో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 99.75 ఎకరాల భూసేకరణ చేపట్టాలి. ఇది కూడా సర్వే జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. భూసేకరణ ప్రక్రియ మాత్రం జరగలేదు. ఇన్ని అడ్డంకులు ఉన్నా.. టెండర్లు పిలిచి.. రెండున్నరేళ్లలో పూర్తి చేసేస్తామంటూ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటించడం హాస్యాస్పదం.

వీఎంఆర్‌డీఏపై ‘ఆర్థిక’ భారం.!

సంపద సృష్టించే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ బాకాలు ఊదిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అప్పుల మూటని రాష్ట్రం నెత్తిన పెట్టేశారు. ఇప్పుడు.. తన ప్రచారయావ కోసం మరోసారి వీఎంఆర్‌డీఏని బలి చేసేందుకు కుట్రపన్నుతున్నారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో వీఎంఆర్‌డీఏ(అప్పటి వుడా) ఆస్తుల్ని విక్రయించి.. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి.. విశాఖకు రిక్త హస్తాలు చూపించారు. ఇప్పుడు.. మరోసారి వీఎంఆర్‌డీఏపై ‘ఆర్థిక’ భారం మోపేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. అంతంత మాత్రం ఆదాయంతో కొట్టుమిట్టాడుతున్న వీఎంఆర్‌డీఏ నుంచి రూ.4,101 కోట్లు తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి వీఎంఆర్‌డీఏ వార్షిక బడ్జెట్‌ కేవలం రూ.1000 కోట్లు మాత్రమే. ఆదాయం లేక.. తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికే నానా యాతన పడుతున్న సమయంలో.. మొత్తం ఆస్తులు అమ్మేసి.. మెట్రోకి పెట్టాలని కూటమి సర్కారు హుకుం జారీ చేసేసింది. దీంతో.. భారీ మొత్తాన్ని ఎలా భరించాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోయినా.. టెండర్ల పేరుతో అరచేతిలో మెట్రో చూపించేందుకు కూటమి సర్కారు సిద్ధమవడం సిగ్గు చేటని పలువురు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement