
అడుగడుగునా వైఫల్యాలు.. నిలువెల్లా మోసాలు
యలమంచిలి రూరల్:
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్దామని, వారి మోసాలను ఎండగడదామని వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. శుక్రవారం యలమంచిలి గురప్ప కల్యాణ మండపంలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’పై మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో చేపట్టే ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి గడపకూ వెళ్లి కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేద్దామన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను నిలువునా ముంచారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో తల్లికి వందనం అనేకమందికి అందలేదన్నారు. అన్నదాతా సుఖీభవ ఇవ్వకుండా రైతులను సంక్షోభంలోకి నెట్టారన్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామని చెప్పి ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల అమలుకు రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ నిస్సిగ్గుగా మాట్లాడడం వారికే చెల్లిందన్నారు.
అన్ని వర్గాలకు అన్యాయం
మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను కూటమి ప్రభుత్వం నిలువునా మోసగించిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు బకాయిలు పెట్టారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మర్చిపోయారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందిచ్చిన హామీలను నూరుశాతం అమలు చేశారని, సంక్షేమానికి కొత్త అర్థం చెప్పిన నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త చరిత్రను రాశారన్నారు. యలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 2.0 పాలనలో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీకి సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ ఆవిష్కరించారు. యలమంచిలి పట్టణ పార్టీ అధ్యక్షుడు బొద్దపు ఎర్రయ్యదొర, పార్టీ మండల అధ్యక్షుడు కొల్లి త్రినాథ్, మున్సిపల్ వైస్‌చైర్మన్లు బెజవాడ నాగేశ్వర్రావు, అర్రెపు గుప్తా, సర్పంచ్ రాజాన మహాలక్ష్మి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఉద్దండం త్రినాథరావు, సేనాపతి రాము, దూది నర్శింహమూర్తి, కొఠారు కొండబాబు, రాపేటి సంతోష్, పిట్టా సత్తిబాబు, పిల్లా త్రినాథరావు, నెట్టెం సత్యనారాయణ, పిట్టా సత్తిబాబు, పలివెల అమృతవల్లి సుమారు 400 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధర్మశ్రీ ఛలోక్తులకు చప్పట్లే చప్పట్లు
తొలిసారిగా యలమంచిలి పార్టీ సమావేశంలో ప్రసంగించిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తనదైన స్టైల్‌లో ఛలోక్తులతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్దకు రూ.1500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంట.. మీరు చెబితే మేము నమ్మేయాలా.. అనడంతో చప్పట్లు మార్మోగాయి. ఎన్నికల్లో మిమ్మల్ని కుమ్మేయాలి.. కూటమి నేతలపై ఎక్కడ ఉమ్మాలో అక్కడ ఉమ్మేయాలన్నారు. నిరుద్యోగ భృతి.. నిరుద్యోగ మృతిగా మారిందన్నారు. తల్లికి వందనం పూర్తిగా ఇవ్వలేదు గానీ నాన్నకు కావాల్సినంత ఇంధనం (మద్యం) మాత్రం ఎక్కడికక్కడ బెల్టు షాపులు పెట్టి అందిస్తోందన్నారు. ఉచిత బస్సు తుస్సు.. ఉచిత గ్యాస్ అంతా ట్రాష్.. అన్నారు. కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు.. ఆరు గ్రూపులుగా దోచుకుంటున్నారన్నారు. ఛలోక్తులతో కూడిన ధర్మశ్రీ మాటలకు కార్యకర్తలు చప్పట్లు, ఈలలతో హర్షధ్వానాలు చేశారు.
కలసికట్టుగా కూటమి తీరును ఎండగడదాం
నమ్మించి వంచించడం చంద్రబాబు నైజం
వైఎస్సార్‌సీపీ యలమంచిలి సమన్వయకర్త ధర్మశ్రీ
‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’పై విస్తృతస్థాయి సమావేశం

అడుగడుగునా వైఫల్యాలు.. నిలువెల్లా మోసాలు

అడుగడుగునా వైఫల్యాలు.. నిలువెల్లా మోసాలు

అడుగడుగునా వైఫల్యాలు.. నిలువెల్లా మోసాలు