
చెట్లు మాయం చేసిన వారిపై కేసు పెట్టాలి
● పోలీసు స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
నర్సీపట్నం : ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ మాకవరపాలెం ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చిటికెల రమణ, వివిధ విభాగాల పార్టీ నాయకులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీమబోయినపాలెం, శెట్టిపాలెం పంచాయతీ పరిధి నర్సీపట్నం నుండి అనకాపల్లి పోవు అర్‌అండ్‌బి రోడ్డుకి ఇరువైపులా ఉన్న వందేళ్లు వయస్సు కలిగిన భారీ వృక్షాలను అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మకై చెట్లు నరికేసి రాత్రికి రాత్రే తరలించుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులకు భయపడి పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు ఫిర్యాదు చేయలేదన్నారు. చెట్లు మాయమవడానికి కారణమైన అధికారపార్టీ నాయకులు, అర్‌అండ్‌బీ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.40 లక్షల విలువైన చెట్లను అక్రమంగా తరలించుకుపోయారని తక్షణమే కేసులు పెట్టాలని కోరారు.