
‘అన్యాయంగా భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేశారు’
డాబాగార్డెన్స్ (విశాఖ): అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం గంటి కొర్లం ప్రాంతంలో తనకు చెందిన ఎకరా 54 సెంట్ల భూమిని తనకు తెలియకుండా విజయనగరం జిల్లా పాలకొండ సబ్ రిజిస్ట్రార్ అన్యాయంగా రిజిస్ట్రేషన్ రద్దు చేశారని బాధితుడు గంప సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అనుమతి లేకుండా విజయనగరం జిల్లా పాలకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి బొల్లాప్రగడ వెంకటరమణమూర్తి అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపారు. సుమారు పదేళ్ల కిందట తన బావమరిది బొల్లాప్రగడ వెంకటరమణమూర్తి తన పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపారు.
అయితే ఇటీవల చెప్పుడు మాటలు విని తనను అకారణంగా ధ్వేషిస్తూ తనపై ఫిర్యాదులు చేస్తున్నారని, ఇదే విషయంలో జనసేన నాయకునిగా చెప్పుకు తిరుగుతున్న అడ్డుపల్లి గణేష్ గత మే 29న తన భూమిలో 50 మందితో కలిసి వచ్చి తనను చంపేస్తామని, భూమి తనకు వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరించి భయబ్రాంతులకు గురి చేశారన్నారు.
స్థానిక పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు తనపై తప్పుడు ఫిర్యాదులు చేసి తనను, తన కుటుంబ సభ్యులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ సుమారు 20 మంది రౌడీలతో తన ఇంటికి వచ్చి బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఇదే విషయమై ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అయినప్పటికి తనకు ఎటువంటి న్యాయం జరగలేదని, జనసేన నేతగా చెప్పుకుంటున్న అడ్డుపల్లి గణేష్ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఇప్పటికై నా అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరారు.
పాలకొండ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకుని, అన్యాయంగా రద్దు చేసిన తన భూమిని తనకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో గంప గోవిందరాజు, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.