
బైక్‌ల దొంగ అరెస్ట్
● ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం
నర్సీపట్నం:ద్విచక్రవాహనాల చోరీ కేసులో ఓ వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్టు చేసి, ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. టౌన్ సీఐ జి.గోవిందరావు కథనం ప్రకారం..ఈ ఏడాది మే నెల 8వ తేదీన బలిఘట్టానికి చెందిన సుర్ల లోవరాజు ద్విచక్రవాహనం చోరీకి గురైంది. ఈ సమయంలో లోవరాజు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా శనివారం కృష్ణాపురం రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తుండగా కాకినాడ జిల్లా తుని మండలం హంసవరం శివారు సీతంపేట గ్రామానికి చెందిన షేక్ బషీర్ బాషా(23) చోరీకి గురైన మోటారు సైకిల్‌తో పట్టుబడ్డాడు. ఇతను గతంలో పిఠాపురం, సామర్లకోట, తుని, యలమంచిలి, అనకాపల్లి పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డాడు. ఈ చోరీలకు సంబంధించిన ఐదు ద్విచక్రవాహనాలను కశిమి రోడ్డులో దాచి ఉంచాడు. నిందితుడి నుంచి మొత్తం ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. షేక్ బషీర్ బాషాపై గాజువాక పోలీసు స్టేషన్‌లో రెండు, పిఠాపురం పోలీసు స్టేషన్‌లో ఒక చోరీ కేసు నమోదయ్యాయి. నిందితుడిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు రమేష్, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.