
ఇదేం తీరువా బాబూ
● రైతుకు గుదిబండగా.. నీటి తీరువా బకాయిలు ● డిమాండ్ నోటీసుల జారీపై అన్నదాతల ఆగ్రహం ● గ్రామసభల నిర్వహణ ద్వారా రైతులపై వత్తిడి ?
మునగపాక: రైతులపై భారం మోపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడులకు గాను అన్నదాత సుఖీభవ అందక రైతులు అవస్థలు పడుతుంటే వారిపై మరింత భారం పడేలా ప్రభుత్వం నీటి తీరువా బకాయిల వసూలుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం నోటీసులు పంపడం విమర్శలకు తావిస్తోంది. ఆదుకోవాల్సింది పోయి ఆర్థిక భారం పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కాలువల ద్వారా సక్రమంగా నీరు అందే పరిస్థితులే లేనప్పుడు తాము నీటి తీరువా ఎలా చెల్లిస్తామంటూ ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సకాలంలో రైతు భరోసా అందించడంతో పాటు రైతులకు అండగా మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని రైతులు చెబుతున్నారు.
అన్నదాతలపై భారం రూ.3 కోట్లు
మండల వ్యాప్తంగా 16,771 రైతు ఖాతాలకు సంబంధించి రూ.3 కోట్ల మేర నీటి తీరువా వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈమేరకు అన్నదాతలకు డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా నీటి తీరువాకు రైతులు రూపాయి చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులపై భారం పడేలా చర్యలు చేపట్టింది.ఆదివారం లోగా డిమాండ్ నోటీసులు ప్రతి రైతుకు అందిస్తామంటూ అధికారులు చెబుతున్నారు.
అధ్వానంగా సాగునీటి కాలువలు
మండలంలో సాగునీటి కాలువలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల స్వరూపం కోల్పోతుండగా, మరికొన్ని చోట్ల మురుగునీరు ప్రవహిస్తోంది. ఇంత దయనీయ స్థితిలో కాలువలుండగా నీటి తీరువా బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు పంపడం సరికాదంటూ రైతులు వాపోతున్నారు. కాలువల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టని అధికారులు బకాయిల వసూలుకు వత్తిడి తెస్తుండడం తగదని అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామసభల ద్వారా వత్తిడి ?
రైతులకు అవగాహన కల్పించే పేరుతో తీరువా బకాయిలు చెల్లించేలా వారిపై వత్తిడి తెచ్చేందుకు రెండు రోజుల్లోగా గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారని తెలిసింది. గ్రామాల వారీగా సభలు నిర్వహించి బకాయిల వసూలుకు సమాయత్తమవుతున్నారు. ఆదివారం లోగా డిమాండ్ నోటీసుల పంపిణీ పూర్తి చేసి సభల నిర్వహణపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా గ్రామసభలు సక్రమంగా జరుగుతాయా అన్న ప్రశ్న నెలకొంది.
1988 చట్ట ప్రకారం నీటి తీరువా చెల్లింపు ఇలా..
సాగునీటి వనరుల అభివృద్ధే లక్ష్యంగా 1988లో నీటి తీరువా చెల్లింపు చట్టం అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం కింద ప్రతి రైతు ఏడాది కొకసారి నీటి తీరువా చెల్లించాలి. వరికి సంబంధించి ఎకరాకు ఒక పంటకు రూ.100, రెండు పంటలకై తే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. చెరకుకు ఎకరాకు రూ.200 చొప్పున చెల్లించాలి. అయితే గత కొన్నేళ్లుగా నీటితీరువా వసూలు చేయడం లేదు. తాజాగా కూటమి ప్రభుత్వం రైతుల నుంచి నీటి తీరువా బకాయిల వసూలుకు ఉపక్రమించడం విమర్శలకు తావిస్తోంది.
ఐదు గ్రామాలు మినహా..
మండలంలోని 28 రెవెన్యూ గ్రామాలున్నాయి. వాటిలో సాగునీటి వనరులున్న గ్రామాలు 23 కాగా మిగిలిన 5 గ్రామాల్లో రైతులు నీటి తీరువా చెల్లించనవసరం లేదు.చెర్లోపాలెం, రాజుపేట అగ్రహారం,పాటిపల్లి,వెంకటాపురం,టి.సిరసపల్లి గ్రామాల రైతులు మాత్రం నీటి తీరువా పన్ను చెల్లించనవసరం లేదు.ఇతర గ్రామాల రైతులు తప్పనిసరిగా ఈ నీటి తీరువా బకాయిలు చెల్లించాల్సిందేనంటూ అధికారులు తెలిపారు.
రైతులపై భారం తగదు
రైతులపై భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం విచారకరం. ఇప్పటికే వ్యవసాయం భారంగా ఉందనుకుంటే నీటి తీరువా బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు అందజేయడం సరికాదు. రైతులను ఆదుకోవాల్సింది పోయి రైతులపై భారం పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం బాధాకరం.
– నరాలశెట్టి సూర్యనారాయణ, రైతు,ఒంపోలు
ప్రతి రైతు చెల్లించాలి
ప్రతి రైతు నీటి తీరువా బకాయిలు చెల్లించాలి. గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తాం.సాగునీటి వనరులు అభివృద్ధి చెందాలంటే నీటి తీరువా బకాయిలు చెల్లించాల్సి ఉంది. సంఘాలు బలోపేతం కావాలంటే రైతుల సహకారం అవసరం.సచివాలయాల్లో పన్నులను ఆన్‌లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించాం. ఇప్పటికే రైతులకు డిమాండ్ నోటీసులు పంపించాం.
– పి.సత్యనారాయణ, తహసీల్దార్, మునగపాక

ఇదేం తీరువా బాబూ

ఇదేం తీరువా బాబూ

ఇదేం తీరువా బాబూ