
కృష్ణారాయుడిపేట వరకే 12డి, 68డి సర్వీసులు
● అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయం ● విశాఖపట్నం ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ పద్మావతి
దేవరాపల్లి: విశాఖపట్నం వయా కొత్తవలస, ఆనందపురం మీదుగా దేవరాపల్లి వెళ్లే మార్గంలో కృష్ణరాయుడిపేట సమీపంలో జీవీఎంసీ కాలువపై గల కల్వర్టు శిథిలాస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోందని విశాఖపట్నం ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ కె.పద్మావతి తెలిపారు. శిథిలాస్థకు చేరిన కల్వర్టును శనివారం ఆమె పరిశీలించారు. అనంతరం దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆమె సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న కల్వర్టుతో పడుతున్న ఇబ్బందులను ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సులు నిర్దేశించిన సమయంలో చేరుతున్నాయో , లేదో పరిశీలించారు. అనంతరం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న కల్వర్టు ఏ సమయంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విశాఖపట్నం నుంచి కొత్తవలస మీదుగా దేవరాపల్లికి వచ్చే 12డి, 68డి బస్సులను కృష్ణారాయుడిపేట వరకు మాత్రమే నడపాలని యోచిస్తున్నట్టు చెప్పారు. ఉన్నతాధికారులతో చర్చించి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మద్దిలపాలెం, సింహాచలం, వాల్తేరు డిపోల నుంచి దేవరాపల్లికి 25 బస్సులు సర్వీస్‌లు నడుస్తున్నాయన్నారు.