
ప్లాస్టిక్ భూతం.. అంతం చేద్దాం
మాకవరపాలెం: ప్లాస్టిక్ రహిత సమాజమే అందరి లక్ష్యం కావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులు, ప్రజలు, అధికారులతో కలసి ప్రాథమిక పాఠశాల వరకు చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలన్నారు. లేకుంటే భవిష్యత్ తరాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
ఇళ్లలోని తడి, పొడి చెత్తను వేరు చేసి వీటి సేకరణకు వచ్చే క్లాప్ మిత్రలకు అందజేయాలన్నారు.
అనంతరం పారిశుధ్య కార్మికులను సత్కరించారు. స్వచ్ఛాంధ్రపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలసి కలెక్టర్ సహంపక్తి భోజనాలు చేశారు. సీఈవో నారాయణమూర్తి, డీపీవో సందీప్, ఆర్డీవో వి.వి.రమణ, మండల ప్రత్యేకాధికారి రామ్మోహన్‌రావు, ఎంపీడీవో చాయాసుధ, తహసీల్దార్ వెంకటటరమణ, ఎంఈవోలు జాన్‌ప్రసాద్, మూర్తి, వివిద శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ
అనకాపల్లి: స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్లాస్టిక్‌ను నిర్మూలిస్తామని శనివారం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.హైమావతి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేసి, ప్రజల్లో చైతన్యం తీసుకొనిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ అండ్ ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ బాలాజీ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, ఎస్‌వో రామచంద్రరావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ భూతం.. అంతం చేద్దాం