
అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి రామానాయుడు
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలో నిర్మించిన సీసీ రోడ్లను రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం ప్రారంభించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి వార్డులో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దీపం పథకం ద్వారా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. వచ్చేనెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నామని చెప్పారు. 2025 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు, కౌన్సిలర్ చింతకాయల రాజేష్, మార్కెట్ యార్డు చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జెడ్పీటీసీ సుకల రమణమ్మ పాల్గొన్నారు.
చోడవరంలో..
చోడవరం: రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు చోడవరంలో శనివారం జరిగిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల కోసం వివరించారు. చోడవరం కాలేజీ ఆవరణంలో జరిగిన జాబ్‌మేళాను పరిశీలించి, వీలైనంత ఎక్కువమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేళాకు వచ్చిన కంపెనీలను మంత్రి కోరారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.