
అడవి కాచిన సరుగుడు అందాలు
ఉమ్మడి జిల్లా విభజన తర్వాత అనేక పర్యాటక ప్రదేశాలు అటు విశాఖ, ఇటు ఏజెన్సీ ప్రాంతంలో ఉండిపోయాయి. కొత్త జిల్లా అనకాపల్లిలో మిగిలిన కొద్దిపాటి పర్యాటక ప్రాంతాల వైపు కూటమి పాలకులు కన్నెత్తి చూడటం లేదు. దాంతో పర్యాటకంగా అభివృద్ధి చెందకపోగా, అసౌకర్యాలతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. సరుగుడు జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు.
నాతవరం:
సరుగుడు జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు హామీ ఆచరణలో అమలు కాలేదు. గతేడాది డిసెంబరు 24న సుందరకోట, అసనగిరి గ్రామాల రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామసభలో సరుగుడు జలపాతంపై గిరిజనులు విన్నవించగా, దానికి స్పందించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పటికి నెలలు గడుస్తున్నా అటు వైపు కన్నెత్తి చూడలేదు.
మట్టిరోడ్డులో వెళ్లలేక ఇబ్బందులు
ఇక్కడ ఎత్తయిన రెండు కొండల మధ్యలోంచి జాలువారే జలపాతాన్ని చూసేందుకు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. సరదాగా కాలక్షేపం చేసేందుకు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కనువిందు చేస్తోంది. అక్కడకు వెళ్లడానికి కనీసం రోడ్డు సదుపాయం లేదు. సరుగుడు నుంచి సుందరకోట వెళ్లే వరకు మాత్రమే తారురోడ్డు నిర్మించారు. సరుగుడు, సుందరకోట గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. సుందరకోటకు వెళ్లే రోడ్డు మధ్యలో కుడి వైపు నుంచి జలపాతానికి వెళ్లాలి. అక్కడ్నుంచి గుంతలతో కూడిన మట్టిరోడ్డు కావడంతో ఏమాత్రం వర్షం పడినా బురదమయంగా మారుతోంది. మార్గంమధ్యలో గెడ్డ నీటిలో దాటుకుంటూ సందర్శకులు వెళ్తుంటారు. కొన్నిసార్లు సందర్శకులు మార్గం తెలియక తికమక పడుతుంటే, గిరిజనులు తాటిదుంగలతో ముఖద్వారం ఏర్పాటు చేశారు.
దుస్తులు మార్చుకోవాలంటే చెట్ల చాటుకు..
జలపాతం వద్ద స్నానాలు చేసి దుస్తులు మార్చుకోవడానికి నిర్మించిన షెడ్డు పూర్తిగా శిథిలమైంది. ఇదే కూలే స్థితిలో ఉంది. దాంతో చెట్లు మాటున మహిళలు దుస్తులు మార్చుకుంటున్నారు. ఆ సమయంలో ఆకతాయిలు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి ఎక్కడ సోషల్ మీడియాలో పోస్టు చేస్తారోనని భయపడుతున్నారు. జలపాతం దిగువ భాగంలో ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసిన ఐరన్ గ్రిల్స్ శిథిలమయ్యాయి. దాంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో పర్యాటక శాఖ అధికారులు రూ. 10 లక్షలతో నిర్మించిన షెడ్డు నిర్వహణ లేక అధ్వానంగా దర్శనమిస్తోంది. జలపాతానికి వేలాది మంది వస్తుండగా, అక్కడ కనీసం మౌలిక సదు పాయాలు కల్పించడం లేదు. ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే గిరిజనుల జీవనోపాధి మెరుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు
జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే మా గిరిజన గ్రామాలు బాగుపడతాయి. గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. మా ప్రాంత గిరిజనులు కోరిక మేరకు సుందరకోట సభలో నేను స్పీకరు దృష్టికి తీసుకెళ్లాను. పర్యాటక కేంద్రంగా చేస్తే అనంతగిరి, లంబసింగి మాదిరిగా సందర్శకులు వస్తారు.
– సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీపీ, నాతవరం

అడవి కాచిన సరుగుడు అందాలు

అడవి కాచిన సరుగుడు అందాలు

అడవి కాచిన సరుగుడు అందాలు