
కష్టాల ఖరీఫ్
మాడుగుల/బుచ్చెయ్యపేట
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి, ఖరీఫ్ పంటలకు ఢోకా లేదని అన్నదాతలు ఆనందించారు. వారం రోజులు వరుసగా చినుకులు రాలడంతో రైతు సేవా కేంద్రాల నుంచి తీసుకున్న ఖరీఫ్ వరి విత్తనాలతో నారు వేశారు. వారం రోజులు దాటినా మొలకలు రాకపోవడంతోనే కష్టాలు మొదలయ్యాయి. ఇంతలో వర్షాలు ఆగిపోయి మళ్లీ ఎండలు మొదలయ్యాయి. కాడెద్దుల సవ్వడితో ముంగారు వర్షాలతో ఆనందంతో సేద్యం చేయాల్సిన వ్యవసాయదారులు ఈ ఏడాది నాటిన వరి నారు ఎండిపోవడంతో ఉసూరుమంటున్నారు. మరోపక్క రెండో దఫా వేసిన వరి విత్తనాలు ఇంకా మొలకలు రావడంలేదు. ఖరీఫ్ సీజన్ దాటిపోతుందన్న కంగారు మొదలయ్యింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కారుమబ్బుల వైపే చూస్తున్నారు. కానీ చినుకు రాలలేదు.. ఆశ తీరలేదని సాగునే నమ్ముకున్న రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి.
ఆగిన వర్షం.. ఆశలు ఆవిరి
ఈ ఏడాది జూన్‌లో సాధారణ వర్షపాతం 141.3 మిల్లీమీటర్లు కాగా 162 మి.మీ. నమోదైంది. దీంతో వరి నారుమడులు సిద్ధం చేసుకుని సగానికి పైగా రైతులు వరి విత్తనాలు వేసుకున్నారు. మరికొంతమంది జూలై మొదటి వారంలో వేసుకోవాలనుకున్నారు. ఇంతలో వర్షాలు ఆగిపోవడంతో వాన చినుకు కోసం ఎదురుచూస్తున్నారు. జూలై నెల సాధారణ వర్షపాతం 235.8 మి.మీ. కాగా 12వ తేదీ వరకు 76 మి.మీ. వర్షపాతం నమోదైందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యవసాధికారి మోహనరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ జూన్‌లో వరుసగా కురిసిన వర్షాలతో విత్తనాలు నాటడం ఆలస్యమైందని, వర్షాలు తగ్గాక మొలక శాతం పెరిగిందని చెప్పారు. ఇంతలో ఎండల వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడిందన్నారు. ఈనెల 15వ తేదీలోగా వరి నారు వేసుకుంటే దిగుబడులు బాగుంటాయని, కానీ వాతావరణం అనుకూలించక వరి నారు వేయడం ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఎక్కడైనా పూర్తి స్థాయిలో మొలక రాకకోతే కేపీ సీడ్స్ వారికి తెలియజేసి విత్తనం అందజేస్తామన్నారు.
ఎర్రవాయి ప్రాంతంలో బీటలు వారిన భూమి
ఎర్రవాయి ప్రాంతంగా గుర్తింపు పొందిన బుచ్చెయ్యపేట మండలంలో పంట పొలాలు ఎక్కువ నీరు ఉన్నా, ఎక్కువగా ఎండకాసినా తట్టుకోలేవు. తేలికపాటి ఇసుక రేగడి భూములు అవ్వడంతో తడి పొడిగా ఉండాలి. గత నెల వర్షాలు కురవడంతో బుచ్చెయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతులు జూలై నెల ఆరంభం నుంచి వరి ఆకుమడులు వేశారు. ఇప్పుడు వాటికి తగినంత నీరు అందడం లేదు.
వారం రోజులుగా వేసవిని తలపిస్తున్న రీతిలో ఎండ కాస్తోంది. బుచ్చెయ్యపేట, కందిపూడి, అయితంపూడి, దిబ్బిడి, ఎల్‌బి పురం, బంగారుమెట్ట, లోపూడి, శింగవరం, పీడీ పాలెం, లూలూరు, పెదమదీన తదితర గ్రామాల్లో వరి ఆకుమడులు సరిగా నాటక ఆకు ఎదుగుదల లేదు. పలు గ్రామా ల్లో భూమి బీటలు వారి వేసిన ధాన్యం భూమిలోనే ఉండిపోయి మొలకెత్తడం లేదు. వచ్చిన లేత ఆకు ఎండకు వడలిపోతోంది. దీంతో పలువురు రైతులు డీజిల్ ఇంజిన్‌తో నీరు తోడి కిలోమీటర్ల పొడవున ప్లాస్టిక్ పైపుల ద్వారా నీటిని తరలించి ఆకుమడులు ఎండిపోకుండా కాపాడుకుంటున్నారు. ఆకు మడి తడపడానికి రూ.500 నుంచి 1,000ల వరకు అదనపు ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. ముందుగా రుతుపవనాలు పలకరించినా ఫలితం లేకపోయిందని నిరాశ చెందుతున్నారు.
మందగించిన రుతుపవనాలు
20 మండలాల్లో కరువు ఛాయలు
నాటిన నారు ఎండిపోతున్న దైన్యం
డ్రమ్ములతో ఆకుమడులు తడుపుతున్న రైతులు
రైతు సేవా కేంద్రాల్లో ఇచ్చిన వరి విత్తనాలతో తగ్గిన మొలక శాతం
రెండో దఫా సొంత విత్తనాలు వేసుకున్న రైతులు
అవి కూడా ఎండకు ఆవిరైపోతున్నాయంటూ ఆవేదన
జిల్లాలో ఖరీఫ్ సాగు లక్ష్యాలు
అన్ని పంటల సాగు2.1 లక్షల ఎకరాలు
వరి సాగులక్షా 50 వేల ఎకరాలు
వరి విత్తనాల పంపిణీ23 వేల క్వింటాళ్లు
ముందుగానే వరుణుడు కరుణించాడని ఆనందించారు. అన్నదాతలు ఉత్సాహంగా విత్తనాలు నాటారు. ఆశించిన స్థాయిలో మొలకలు రాలేదు. ఇంతలో వర్షాలు ఆగిపోయి జూలై నెలలో మండు వేసవిని తలపించేలా ఎండలు మండిపోవడం మొదలైంది. నేల బీటలు వారి వరి ఆకుమడులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పదును తగ్గకుండా రైతులు ఆకుమడులను రక్షించుకునే పనిలో పడ్డారు. నీరు తెచ్చుకొని నారు తడుపుతున్నారు. కరువు ఛాయలు కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు.
ఆరంభంలోనే కష్టాలు మొదలు
పది రోజుల కిందట వరి ఆకు వేశాను. వారం రోజులుగా వర్షాలు లేకపోగా ఎండలు మండిపోతున్నాయి. వరి ఆకుమడికి నీరందక భూమిలో పదును లేక సరిగా నాటకపోగా వచ్చిన లేత ఆకు ఎండవేడికి వడలిపోతుంది. ప్లాస్టిక్ పైపుల ద్వారా నీరు తోడి ఆకుమడిని తడుపుతున్నాం. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే మాకు నీటి కష్టాలు వచ్చాయి.
– గాడి చిరంజీవి,
కందిపూడి, బుచ్చెయ్యపేట మండలం
ఎండిపోతున్న వరి నారు
ఈ ఏడాది ముందుగా వర్షాలు అనుకూలించాయని ఆనందించాము. దుక్కులు చేసి విత్తనాలు వేశాము. రైతు సేవా కేంద్రాల్లో అందజేసిన విత్తనాల నుంచి 40 శాతం మాత్రమే మొలకలు రావడంతో మళ్లీ విత్తనం వేసుకున్నాం. గత నాలుగు రోజులుగా మండుతున్న ఎండలకు రెండో దఫా వేసిన విత్తనం కూడా మొలక రాలేదు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి.
– పర్రే రామునాయుడు, గాదిరాయి, మాడుగుల మండలం

కష్టాల ఖరీఫ్

కష్టాల ఖరీఫ్

కష్టాల ఖరీఫ్

కష్టాల ఖరీఫ్