
గ్రామాలపై వేటు.. కాలుష్యం కాటు
ఎస్.రాయవరం: రసాయనాలు వెదజల్లే కంపెనీలు పెట్టి కోనసీమలాంటి తమ ప్రాంతాన్ని కలుషితం చేయవద్దని గుర్రాజుపేట రైతులు వేడుకున్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, పర్యావరణ సమతుల్యత పాటించే పరిశ్రమలు పెడితే స్వచ్ఛందంగా భూములిస్తామని వారు అధికారులకు స్పష్టం చేశారు. నక్కపల్లి, ఎస్.రాయవరం మండ లాల మధ్యలో గల 800 ఎకరాలు సేకరించి, బల్క్‌డ్రగ్ పార్కుకు కేటాయించేందుకు గుర్రాజుపేట గ్రామ సచివాలయంలో రైతులతో సోమవారం గ్రామసభ ఏర్పాటు చేశారు. ఏపీఐఐసీ ప్రత్యేక ఉప కలెక్టర్ అనిత రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. బల్క్‌డ్రగ్ పార్కును ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దని, అలా చేస్తే పంటలు కోల్పోతామని, గ్రామంలో నివాసం కూడా ఉండలేమని రైతులు స్పష్టం చేశారు. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు చేసిన హెటెరో డ్రగ్స్ కంపెనీ వల్ల ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎస్‌డీసీ అనిత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పరిశ్రమల ఏర్పాటుకు భూ సేకరణ జరుగుతోందని, తాము రైతులు, ఈ ప్రాంతవాసుల అభిప్రాయాలు తీసుకుని కలెక్టర్‌కు నివేదిస్తామని చెప్పారు. తమ అభ్యంతరాలను వివరిస్తూ రైతులు ఎస్‌డీసీకి వినతి పత్రం అందజేశారు. ఈ గ్రామ సభలో సర్పంచ్ రత్నం, ఉప సర్పంచ్ దాట్ల రాజానరాజు, నాయకులు రామురాజు, రైతులు తహసీల్దార్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
బల్క్‌డ్రగ్ పార్కుకు భూములు ఇవ్వలేం
గుర్రాజుపేట గ్రామసభలో రైతుల స్పష్టీకరణ