
సర్వేఎందుకో చెప్పండి..
యలమంచిలి రూరల్: పరిశ్రమల ఏర్పాటుకు కానీ, మరే ఇతర అవసరాలకు గానీ తమ భూములు ఇచ్చేది లేదని యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లి, మంత్రిపాలెం, పెదగొల్లలపాలెం గ్రామాల ప్రజలు, రైతులు తెగేసి చెప్పారు. ఎర్రవరం రెవెన్యూ పరిధి పెదపల్లి ప్రాంతంలో రిజర్వ్ ఫారెస్ట్ భూములు సరిహద్దుగా ఎంత విస్తీర్ణంలో ప్రభుత్వ, జిరాయితీ భూములు ఉన్నాయో తెలుసుకునేందుకు చేస్తున్న సర్వే ఎందుకో చెప్పాలని యలమంచిలి తహసీల్దార్‌ను మంగళవారం నిలదీశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పెదపల్లి ప్రాంతంలో ప్రభుత్వ భూముల విస్తీర్ణాన్ని నిర్థారించడానికి సర్వే చేస్తున్నామని తహసీల్దార్ వరహాలు చెప్పడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రిపాలెం వేమాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గ్రామస్తులతో తహసీల్దార్ నిర్వహించిన సమావేశంలో అరుపులు, కేక లతో గందరగోళం ఏర్పడింది. బలవంతంగా భూమిని సేకరిస్తే ఎవరికై నా కేటాయిస్తే తమకు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని రాతపూర్వకంగా పేర్కొంటూ తహసీల్దారుకు గ్రామస్తులంతా సంతకాలు చేసిన వినతిపత్రాన్ని అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకే పెదపల్లి ప్రాంతంలో అటవీ భూములు మినహాయించి ఎంత ప్రభుత్వ భూమి ఉందో పెదపల్లికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు భూముల సర్వేను మూకుమ్మడిగా వ్యతిరేకించారు. వైఎస్సార్‌సీపీ, కూటమి నాయకులు బొద్దపు ఎర్రయ్యదొర, కోడిగుడ్డు రమణ, దాసరి కుమార్, బొద్దపు నాగేశ్వర్రావు, దుంగా అచ్యుతరావు, బొద్దపు రమణ, బొద్దపు కృష్ణ, బొద్దపు గణేష్, బొద్దపు మణిప్రకాష్, బొద్దపు కాశీ, మరిశా ఈశ్వర్రావు, చిత్త ఈశ్వర్రావు, అనసూరి కృష్ణ పాల్గొన్నారు.
చావనైనా చస్తాం గానీ.. భూములివ్వం
మాకు తెలీకుండా ప్రభుత్వం భూసేకరణకు యత్నిస్తోంది
బలవంతంగా తీసుకుంటే చూస్తూ ఊరుకోం
తహసీల్దార్‌ను నిలదీసిన పెదపల్లి, మంత్రిపాలెం, గొల్లలపాలెం గ్రామస్తులు