
‘మిషన్ వాత్సల్య’లో విద్యార్థులకు రెండేళ్ల ఆర్థిక సాయం
● జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ పీడీ సూర్యలక్ష్మి
సింగన్నదొరపాలెం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న పీడీ సూర్యలక్ష్మి
కె.కోటపాడు: మిషన్ వాత్సల్య పథకంలో 18 సంవత్సరాలలోపు విద్యార్థులకు రెండేళ్లపాటు ఆర్థిక సాయం అందచేస్తున్నామని జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ పీడీ సూర్యలక్ష్మి తెలిపారు. మంగళవారం ఆమె మండలంలో సింగన్నదొరపాలెం, ఎ.కోడూరు గ్రామాల్లో మూడు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రీ స్కూలు, గ్రోత్ మానిటరింగ్, మెడిసిన్ కిట్స్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె ఇక్కడి ఐసీడీఎస్ కార్యాలయంలో మాట్లాడారు. 18 సంవత్సరాల వయస్సు వరకు ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లి, మళ్లీ పాఠశాల నుంచి ఇంటికి వచ్చే విద్యార్థులకు మాత్రమే నెలకు రూ.4,000 వంతున సహాయం అందిస్తున్నామన్నారు. పోషకాహారం, రవాణా ఖర్చులు, ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ సహాయం అందిస్తున్నామని చెప్పారు. మిషన్ వాత్సల్య పథకం కింద జిల్లాకు 2024–2025 ఆర్థిక సంవత్సరంలో కోటి 42 లక్షల 38 వేల రూపాయలు మంజూరయ్యాయన్నారు. తొలి విడతగా 332 మంది విద్యార్థుల ఖాతాలో సొమ్ము జమ చేశామన్నారు. మలివిడత మరో 408 మంది విద్యార్థుల బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేయనున్నట్లు చెప్పారు. పీడీ వెంట స్థానిక సీడీపీవో లలితాకుమారి ఉన్నారు.