బదిలీ అయినా విముక్తి లేదు | - | Sakshi
Sakshi News home page

బదిలీ అయినా విముక్తి లేదు

Jul 16 2025 4:07 AM | Updated on Jul 16 2025 4:07 AM

బదిలీ అయినా విముక్తి లేదు

బదిలీ అయినా విముక్తి లేదు

● రిలీవర్లు లేక హిందీ పండిట్ల కష్టాలు ● 136 మందికి ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్లు వచ్చినా చేరినవారు 26 మందే.. ● పాఠశాలలో మరో హిందీ టీచర్‌ లేరని రిలీవ్‌ చేయని ప్రభుత్వం

నక్కపల్లి: బదిలీల ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా తాము కోరుకున్న పాఠశాలల్లో చేరేందుకు రిలీవింగ్‌ ఉత్తర్వులు రాక పలువురు హిందీ పండిట్లు నిరాశకు లోనవుతున్నారు. తమను రిలీవ్‌ చేసి బదిలీ చేసిన పాఠశాలల్లో విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలంటూ మొరపెట్టుకుంటున్నారు. పాఠశాల విద్యా విభాగంలో నెలన్నర క్రితం చేపట్టిన హిందీ పండిట్ల బదిలీల కౌన్సెలింగ్‌లో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో పలువురు హిందీ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా పరిషత్‌ యాజమాన్యంలో జరిగిన ఈ కౌన్సెలింగ్‌లో 183 మందిఽ హిందీ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా వారిలో 136 మంది బదిలీ ఉత్తర్వులు పొందారు. అయితే వారికి ప్రత్యామ్నాయం (రిలీవర్‌) ఉండాలని, కానిపక్షంలో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్‌ చేయడానికి వీల్లేదంటూ ప్రభుత్వం కొత్త సమస్య లేవనెత్తింది. దీంతో బదిలీ అయిన వారిలో కేవలం 26 మందికి మాత్రమే వారు కోరుకున్న పాఠశాలల్లో విధుల్లో చేరేందుకు అవకాశం ఏర్పడింది. రిలీవర్లు లేకపోవడంతో బదిలీ ఉత్తర్వులు పొందిన మిగిలిన వారు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లోనే కొనసాగుతున్నారు. తాము పనిచేస్తున్న పాఠశాలల్లో ఒక్క స్కూల్‌ అసిస్టెంట్‌ హిందీ ఉపాధ్యాయ పోస్టు మాత్రమే ఉండటంతో బదిలీ అయినవారంతా ఆయా పాఠశాలల్లోనే కొనసాగక తప్పడం లేదు.

ఇది ఎన్నటికీ తీరని సమస్య

2025 డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఉమ్మడి విశాఖ నుంచి కేవలం 23 హిందీ పండిట్‌ పోస్టులు మాత్రమే ఉన్నాయి. కనీసం ఏడాది కాలం పట్టే ఈ నియామక ప్రక్రియ పూర్తయ్యాక కూడా రిలీవర్‌ సమస్య వెంటాడే అవకాశం ఉందని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇది తీరని సమస్య అని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విద్యాసంవత్సరంలో ఇటువంటి నిబంధనలు అమల్లోకి తెచ్చి బదిలీ అయిన వారిని రిలీవ్‌ చేయకుండా కాలయాపన చేయడం తగదని వారు అంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్‌ చేయాలని కోరుతున్నారు. ఎంఈవో కుంచం నరేష్‌ వివరణ కోరగా బదిలీ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులు వారు కోరుకున్న పాఠశాలల్లో జాయిన్‌ అయ్యే విధంగా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. వారి స్థానంలో రిలీవర్‌ వచ్చే వరకు వెనక్కి వచ్చి పాత పాఠశాలల్లో పనిచేయాలని ఆదేశించామన్నారు. రిలీవర్‌ వచ్చేక వారిని బదిలీ అయిన పాఠశాలలకు పంపించడం జరుగుతుందన్నారు. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి చాలామంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారని, అయితే అక్కడ పాఠశాలల్లో రిలీవర్లు లేకపోవడంతో ఏజెన్సీ నుంచి ఇక్కడకు బదిలీ అయిన వారిని వదిలిపెట్టడం లేదన్నారు. వారం పది రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అయితే రిలీవింగ్‌ ఉత్తర్వులు సైతం ఇవ్వడం లేదని హిందీ ఉపాధ్యాయులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement