బొమ్మను చేసి.. ప్రాణం పోసి.. | - | Sakshi
Sakshi News home page

బొమ్మను చేసి.. ప్రాణం పోసి..

Jul 16 2025 4:07 AM | Updated on Jul 16 2025 4:07 AM

బొమ్మ

బొమ్మను చేసి.. ప్రాణం పోసి..

చెట్టునుంటే కొమ్మ.. కళాకారుడు చెక్కితే బొమ్మ.. ఆ బొమ్మకు ప్రాణం పోస్తే.. అది ఏటికొప్పాక లక్క బొమ్మ. అవును.. ఈ బొమ్మల్లో జీవ కళ ఉట్టిపడుతుంది. అవి మనల్ని పలకరిస్తాయి. కబుర్లు చెబుతాయి. ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పిల్లల్నే కాదు పెద్దల్నీ ఆకట్టుకుంటాయి. దేశీయంగానే కాదు అంతర్జాతీయంగానూ ఖ్యాతి గడిస్తాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ప్రధాని మోదీలను సైతం మంత్రముగ్ధులను చేశాయి. అందుకనే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ ఎంపిక కావడమే కాదు జాతీయ స్థాయిలో అవార్డును అందుకున్నాయి.
● ఖండాంతరాలు దాటిన ఏటికొప్పాక లక్కబొమ్మల ఖ్యాతి ● ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’లో జాతీయ స్థాయి అవార్డు ● ఢిల్లీలో పురస్కారం అందుకున్న కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

ఏటికొప్పాక బొమ్మలు

సాక్షి, అనకాపల్లి:

ప్రతి జిల్లాకు ప్రత్యేకతగా నిలిచే ఉత్పత్తులను గుర్తించి వాటిని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్థానికంగా ఉత్పత్తుల తయారీని, ఎగుమతులను పెంచి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని నిర్ణయించింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడేలా అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏటికొప్పాక హస్తకళకు అవకాశం లభించింది. ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’లో మంచి ఫలితాలు సాధించడంతో జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, ఢిల్లీ సీఎం రేఖాగుప్తాల చేతుల మీదుగా అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అవార్డును అందుకున్నారు.

అవార్డులు కొత్త కాదు

గతంలో కూడా ఏటికొప్పాక బొమ్మలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపుతోపాటు కళాకారుడు సీవీ రాజుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. విశాఖకు చెందిన ప్రొఫెసర్‌ బొగాది నీలిమ అనే యువతి ఏటికొప్పాక హస్తకళా నైపుణ్యంపై ‘సాగా ఆఫ్‌ ది విమెన్‌’ పేరిట డాక్యుమెంటరీ తీసి, ప్రపంచంలో రెండో స్థానం కై వసం చేసుకున్నారు. ఇటీవల గతేడాది జూన్‌ నెలలో కర్నూల్‌లో ఏర్పాటు చేసిన లేపాక్షి హస్తకళల ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఈ బొమ్మలు నిలిచాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి సంస్థల ఆన్‌లైన్‌ అమ్మకాలతో లక్కబొమ్మలు అంతర్జాతీయ ఖ్యాతి నార్జించాయి. దేశ ప్రధాని సైతం ‘మన్‌ కీ బాత్‌’లో లక్కబొమ్మల విశిష్టత గురించి ప్రస్తావించారు. సహజసిద్ధమైన రంగులతో ప్రయోగాలు చేసి ఏటికొప్పాక బొమ్మకి కొత్త కళను తెచ్చినందుకు సీవీ రాజుకి 2002లో రాష్ట్రపతి అవార్డు, 2012లో నేషనల్‌ ఇన్నోవేషన్‌ అవార్డు లభించాయి. అదేవిధంగా ఏటికొప్పాకకు చెందిన మరో కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి.. మైక్రో ఆర్ట్స్‌ చేయడంలో నిపుణుడు. ఆయనకు 2003లో జాతీయ హస్త కళల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. అలాగే బియ్యపు గింజ మీద పట్టేంత వీణ, గుండుసూది మీద పట్టేంత తాజ్‌మహల్‌, ఏనుగు, బుద్ధుడు, ఎడ్లబండి, శ్రీరామపట్టాభిషేకం, 5.5 మిమీ పరిమాణంలో తయారుచేసిన అతి చిన్న చెస్‌ బోర్డు, తల వెంట్రుక మీద నిలబెట్టగలిగే పక్షులు... ఇలా అనేక మీనియేచర్‌ ఆర్టులను ఆయన తయారు చేశారు. ఇలా రంగులీనుతూ కనిపించే ఈ బొమ్మల వెనుక కళాకారుల సృజనాత్మకత మనల్ని కట్టిపడేస్తుంది.

ఎల్లలు దాటిన ఖ్యాతి

ఏటికొప్పాక బొమ్మలు దేశ, విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. అమెరికా, శ్రీలంక, ఆస్ట్రేలియా, పోలెండ్‌, హాలెండ్‌, స్విట్జర్లాండ్‌, నేపాల్‌, బ్రిటన్‌, జర్మనీ వంటి విదేశాలతో పాటు ఢిల్లీ, చైన్నె, ముంబై, కోల్‌కత్తా, బెంగళూరు, హైదరాబాద్‌, భువనేశ్వర్‌, రాజస్థాన్‌, పాట్నా, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. కుంకుమ భరిణిలు, నూనెలు, ఆభరణాలు దాచుకునే డబ్బాలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, మహిళలు ధరించే గాజులు, కీ చైన్లు, ఫ్లవర్‌వాజ్‌లు, రైలు బండ్లు, ద్విచక్రవాహనాలు, దేవతామూర్తుల బొమ్మలు మొదలుకుని గ్రామీణ వాతావరణం, తిరుపతి వెంకన్న ఫోటోలు, రామాంజనేయ యుద్ధ సన్నివేశాలు, పెళ్లి తంతు, పెళ్లి సారె, రిస్ట్‌ వాచీలు వంటివి కళాప్రియులను మంత్రముగ్ధులను చేస్తాయి.

బొమ్మను చేసి.. ప్రాణం పోసి.. 1
1/6

బొమ్మను చేసి.. ప్రాణం పోసి..

బొమ్మను చేసి.. ప్రాణం పోసి.. 2
2/6

బొమ్మను చేసి.. ప్రాణం పోసి..

బొమ్మను చేసి.. ప్రాణం పోసి.. 3
3/6

బొమ్మను చేసి.. ప్రాణం పోసి..

బొమ్మను చేసి.. ప్రాణం పోసి.. 4
4/6

బొమ్మను చేసి.. ప్రాణం పోసి..

బొమ్మను చేసి.. ప్రాణం పోసి.. 5
5/6

బొమ్మను చేసి.. ప్రాణం పోసి..

బొమ్మను చేసి.. ప్రాణం పోసి.. 6
6/6

బొమ్మను చేసి.. ప్రాణం పోసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement