
పార్కు స్థలాల విషయంలోనూ..!
జీవీఎంసీకి చెందిన పార్కు స్థలాల వ్యవహారంలో ప్రతీ విషయంపై తనకు సమాచారం కావాలని రెండు రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మరీ మేయర్ ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులూ తన ముందు ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ వివరాలన్నీ తనకు పరోక్షంగా సహకరిస్తున్న జనసేన కార్పొరేటరుకు చేరవేసి.. రచ్చ చేయడం ద్వారా దండుకోవాలని పక్కాగా ప్లానింగ్ చేస్తున్నారని కూడా సొంత పార్టీ కార్పొరేటర్లు గుసగుసలాడుకుంటున్నారు. ఈ వ్యవహారంలో మేయర్ పాత్రపై కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కూటమి కార్పొరేటర్లు కొందరు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే మేయర్‌కు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీకి మధ్య పార్టీ సమావేశం సాక్షిగా మాటల యుద్ధం నడిచింది. మొత్తానికి కూటమి పార్టీలోని కార్పొరేటర్లు, నేతలకు.. మేయర్ వర్గానికి మధ్య మొదలైన ఈ రచ్చ కాస్తా ఏ తీరాలకు చేరుతుందనేది త్వరలో తేటతెల్లం కానుంది.