● పదే పదే ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం
● అధికారుల తీరుపై అర్జీదారుల అసహనం
● పీజీఆర్‌ఎస్‌కు 309 అర్జీలు
తుమ్మపాల: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతుల పరిష్కారంపై పలువురు అర్జీదారులు అధికారులను ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి పరిష్కారం లేదని, భూముల ఆక్రమణ, రికార్డుల మార్పులపై ఫిర్యాదులు చేసినప్పటికి నిలువరించే పరిస్థితులపై అధికారులు కనీసం చొరవ చూపడం లేదని పలువురు అర్జీదారులు వాపోయారు. కలెక్టర్ విజయ కృష్ణన్ లేకపోవడంతో పీజీఆర్‌ఎస్ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అధికారుల్లో కొన్ని శాఖల అధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా హామీలు పరిష్కారం లభించడం లేదంటూ కలెక్టరేట్ గేటు వద్ద పలు శాఖల సిబ్బందితోపాటు వివిధ వర్గాల ప్రజలు మండుటెండలో సైతం వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. అనుమతులు తీసుకున్న వారికి తప్ప ఇతరులు నిరసనలు చేసేందుకు పోలీసులు అంగీకరించకపోవడంతో పలువురి అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పలు సమస్యలపై ఉపాధి కూలీలు, వెలుగు వీవోఏలు, భూసేకరణ బాధితులు, ల్యాండ్ ఫూలింగ్ రైతులు, కల్లు గీత కార్మికుల నిరసనలు, ఆందోళనలతో కలెక్టరేట్ వేడెక్కింది.
●పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టరేట్ వేదికగా డీఆర్వో వై.సత్యనారాయణరావు, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్‌వీఎస్ సుబ్బలక్ష్మి, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వై.శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. అర్జీదారుల సమస్యలు తెలుసుకుని గడువులోగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ వారం పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 309 అర్జీలు నమోదయ్యాయి. పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
1) డీ–పట్టా భూములను ఆన్‌లైన్ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరయ్యేలా చూడాలని కోరుతూ ఎస్.రాయవరం మండలం పెద్దగుమ్మ లూరు దళిత రైతులు వినతి సమర్పించారు.
2) శతశాతం వికలాంగత్వం ఆధారంగా రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలంటూ వి.మాడుగుల మండలం ఎం.కోడూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు మెండేపు గోవింద పీజీఆర్‌ఎస్‌లో విన్నవించుకున్నాడు.
3) ఉపాధి హామీ పథకం కింద చెరువులో నాటిన కొబ్బరి మొక్కల పెంపకానికి కూలి చెల్లించకుండా టెక్నికల్ అసిస్టెంట్ ఆనందరావు దోచుకుని తమకు తీవ్ర అన్యాయం చేశారు. అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వడ్డాది గ్రామానికి చెందిన దివ్యాంగ వేతనదారులు లంక బాలకృష్ణ, మామిడి అప్పలకొండ కోరారు. గ్రామంలో మూడెకరాల ప్రభుత్వ భూమిలో కొబ్బరి మొక్కలు నాటి వాటి పెంపకం బాధ్యతలు తమకు అప్పగించారన్నారు.
4) వెలుగు విభాగంలో పనిచేస్తున్న వీవోఏలకు మూడేళ్ల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వీవోఏ సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. పీజీఆర్‌ఎస్‌లో సంబంధిత ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు.
కలెక్టరేట్‌లో నిరసనలు, ఆందోళనలు