
కూటమిలో కోడి కుంపటి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
కోడి వ్యర్థాల అక్రమ రవాణా వ్యవహారం కూటమి నేతల్లో చిచ్చురేపుతోంది. మేయర్ పీఠాన్ని అధిష్టించి మూడు నెలలు కాకముందే ఏకంగా మంట పుట్టిస్తోంది. కుట్రలకు తెరతీస్తూ కొత్త చర్చకు దారితీస్తోంది. ఒకవైపు జనసేన ఎమ్మెల్యే, మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యేతో పాటు జోన్‌కు ఒక కార్పొరేటర్ కీలకంగా వ్యవహరిస్తూ కొన్నాళ్లుగా కోడి వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్నారు. వారిలో సఖ్యత కుదరక రోజుకు ఒక వాహనాన్ని పోటీపడీ మరీ పట్టిస్తున్నారు. తాజాగా అనకాపల్లి వద్ద కోడి వ్యర్థాలను తరలిస్తున్న లారీలను అధికారులు పట్టుకోగా.. వాహన డ్రైవర్ కాస్తా గంధం శ్రీనుతో పాటు జీవీఎంసీ అధికారి పేరును ప్రస్తావించడంతో వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. తనకు ఫ్లోర్ లీడర్ పోస్టు రాకూడదనే సొంత పార్టీ నేతలే ఈ విధంగా తనను భ్రష్టుపట్టిస్తున్నారంటూ టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీను వాపోతుండటం విశేషం. డిప్యూటీ మేయర్ పోస్టు ఆశించిన గంధం శ్రీనుకు చివరి క్షణం వరకూ ఆశలు రేపి తుస్సుమనిపించారు. ఇప్పుడు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడరు పోస్టును ఆశిస్తున్నారు. దీనిపై ఇన్ని రోజులుగా నాన్చుతూ వచ్చి.. ఇప్పుడు పూర్తిగా తప్పించేందుకే కోడి వ్యర్థాల తరలింపులో పేరు వచ్చే విధంగా చేశారని తన సన్నిహితుల వద్ద ఆయన వాపోయినట్టు సమాచారం. ఈ కుట్రలో స్వయగా మేయర్ పాత్ర ఉందని కూడా ఆయన చెబుతున్నట్టు విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించాలని.. అసలైన కుట్రదారులెవరో బయటపడాలని కూటమి పార్టీల కార్పొరేటర్లతో పాటు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు.
సబ్బవరం వద్ద
మరో వాహనం పట్టివేత
ఈ వ్యవహారం ఒకవైపు నడుస్తుండగా తాజాగా జోన్–2 నుంచి కోడి వ్యర్థాలను తరలిస్తున్న ఏపీ39వీసీ3118 బొలెరో వాహనాన్ని సబ్బవరం వద్ద పట్టుకున్నారు. ఈ వాహనంపై ఫిర్యాదు కూడా చేసినప్పటికీ తప్పించడం గమనార్హం. జూన్ 11వ తేదీన ఇదే వాహనాన్ని మూర్తియాదవ్ చిన్నవాల్తేరు వద్ద పట్టుకుని జీవీఎంసీ అధికారులకు అప్పగించారు. ఇప్పుడు అదే వాహనం మళ్లీ దర్జాగా రోడ్లపై తిరుగుతోంది.
ఫ్లోర్ లీడర్ ఇవ్వకుండా తెరవెనుక కుట్రలంటూ కార్పొరేటర్ గంధం మండిపాటు
కోడి వ్యర్థాల తరలింపులో బెదిరించి మరీ పేర్ల ప్రస్తావించారంటూ ఆగ్రహం
సొంత పార్టీ నేతలే కారణమంటూ ఫైర్
మేయర్ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న కార్పొరేటర్లు