
వడ్డీలు.. చిట్టీలు..
యలమంచిలి రూరల్:
అతనో టీడీపీ నేత. 15 ఏళ్లకు పైగా యలమంచిలి మున్సిపాలిటీ తెరువుపల్లిలో పాలసేకరణ కేంద్రంలో వేతన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అమాయక ప్రజలందరినీ నమ్మించి వడ్డీ ఆశ చూపాడు. సుమారు 300 మంది నుంచి రూ.4.30 కోట్లు అప్పులు, చిట్టీల రూపంలో వసూలు చేశాడు. ఆ టీడీపీ నేత పేరు దాడిశెట్టి పైడియ్య (నానాజీ). మొదట్లో వడ్డీ సక్రమంగా చెల్లించడంతో ఆశ పడిన జనం దాచుకున్న సొమ్ముతోపాటు ఇళ్లు, బంగారం తనఖా పెట్టి మరీ కోట్లలో అప్పుగా ఇచ్చారు. ఆయన ఫోర్జరీ సంతకాలతో రాసిచ్చిన ప్రామిసరీ నోట్లను దగ్గర పెట్టుకొని తమ సొమ్ము భద్రంగా ఉందని ధీమాగా ఉన్నారు. చివరకు ఆ నాయకుడు కుటుంబంతో సహా గ్రామం నుంచి పరారవడంతో దారుణంగా మోసపోయామని తెలుసుకొని లబోదిబోమంటూ యలమంచిలి రూరల్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని గత రెండు వారాలుగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
●పాయకరావుపేటకు చెందిన వ్యాపారి పెదిరెడ్డి వెంకటేశ్వర్రావు అదే మండలంలోని సత్యవరం గ్రామంలో గత 30 ఏళ్లుగా కుటుంబంతో నివాసముంటున్నాడు. తునిలో నగల దుకాణం, వస్త్ర దుకాణం నడిపేవాడు. పలువురితో పరిచయాలు పెంచుకుని సుమారు రూ.20 కోట్లు ప్రజల నుంచి అప్పుగా తీసుకుని కుటుంబంతో సహా పరారయ్యాడు. వ్యాపారి ఇచ్చిన ప్రామిసరీ నోట్లను చూపుతూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
●కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన పద్మజ అనధికారికంగా చిట్టీలు నిర్వహిస్తూ సుమారు రూ.4 కోట్లకు పైగా పలువురి వద్ద నుంచి వసూలు చేసింది. అదను చూసి పరారవడంతో చిట్టీలు కట్టిన వారంతా లబోదిబోమంటున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఇవన్నీ నెల రోజుల వ్యవధిలో బయటపడిన ఫైనాన్స్ మోసాలు. అమాయకులే లక్ష్యంగా.. నమ్మకమే పెట్టుబడిగా తమకున్న పరిచయాలతో దొరికినవారినల్లా నిలువునా మోసగించారు కేటుగాళ్లు. మోసం బయటపడే సమయానికి నగదు, బంగారం తీసుకొని కుటుంబంతో సహా ఎవ్వరికీ దొరక్కుండా పరారయ్యారు. అనధికార చిట్టీలను నిర్వహించడం, వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో డబ్బు సేకరణ చట్టరీత్యా నేరం. అయినప్పటికీ జనం నమ్మకాన్ని ఆసరాగా చేసుకుంటున్న మోసగాళ్లు వీలైనంత ఎక్కువ మందికి కుచ్చుటోపీ పెట్టి దర్జాగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. వారాల తరబడి ఆర్థిక నేరగాళ్లను పట్టుకోకుండా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
దీనిని ఆసరాగా చేసుకుంటున్న మరికొందరు అమాయక ప్రజలను మోసగించకముందే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. మరోవైపు ఇలాంటి మోసాలు నిత్యం వెలుగుచూస్తున్నా ప్రజల్లో సైతం మార్పు రావడంలేదు. అమాయకత్వం, అతివిశ్వాసం, వడ్డీ డబ్బుకు ఆశతో సర్వస్వం మోసగాళ్ల చేతిలో పెట్టి అంతా అయిపోయాక లబోదిబోమంటున్నారు. జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఆర్థిక నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనుమతి లేని చిట్టీల నిర్వాహకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు.
అవసరానికి అక్కరకొస్తుందని రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు వేసిన సామాన్యులు.. వడ్డీ ఎక్కువొస్తుందని ఆశపడి బడా బాబుల చేతుల్లో తమ కష్టార్జితాన్ని ఉంచిన అమాయకులు లబోదిబోమంటున్నారు. పిల్లల చదువు కోసం దాచుకున్న డబ్బులు కొందరివైతే.. కూలీ నాలీ చేసి కూడబెట్టిన సొమ్ములు మరికొందరివి. ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న వారిని నమ్మి నిలువునా మోసపోతున్న ఉదంతాలు ఈమధ్య జిల్లాలో ఎక్కువయ్యాయి.
ఆపై అనధికార చిట్టీల నిర్వహణ
జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్న ఘరానా మోసాలు
యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయం కోసం వచ్చిన తెరువుపల్లి మహిళలు