
టీడీఆర్ బాండ్లతో దళారులకు మేలు
మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, విశాఖ నగర 78వ వార్డు కార్పొరేటర్ బి.గంగారాం హెచ్చరించారు. పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల దీక్ష శనివారం ముగిసింది. దీక్షలో కూర్చొన్న వారికి ఆయన నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా గంగారాం మాట్లాడుతూ నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. గతంలో అధికారులు ఇచ్చిన హామీలో భాగంగా నిర్వాసితులకు పరిహారాన్ని నేరుగా నగదు రూపంలో చెల్లించాల్సిందేనన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం బాధితులకు మెరుగైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. టీడీఆర్ బాండ్లు వల్ల దళారులకు మేలు చేకూరుతుందని విమర్శించారు. నిర్వాసితులను మోసం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆలోచన చేసి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. లేకుంటే 14 గ్రామాలకు చెందిన నిర్వాసితుల కుటుంబాలతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.శంకరరావు, నిర్వాసితుల సంఘ కన్వీనర్ ఆర్.రాము, సీపీఎం నాయకులు ఎస్.బ్రహ్మాజీ, కర్రి అప్పారావు, రామ సదాశివరావు, కన్నుంనాయుడు, నాగిరెడ్డి సత్యనారాయణ, కూండ్రపు సోమునాయుడు, పెంటకోట సత్యనారాయణ, కడారి అప్పారావు, కాండ్రేగుల బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.
పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి
విశాఖ 78వ వార్డు కార్పొరేటర్ గంగారాం డిమాండ్
ముగిసిన సీపీఎం నేతల 24 గంటల దీక్ష