
కథ అడ్డం తిరిగింది
● టీడీపీ సానుభూతిపరులతో హోంమంత్రి మంతనాలు ● మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు భూములివ్వాలని ఒత్తిడి ● ససేమిరా అన్న రైతులు.. ● ప్రాణాలిచ్చి అయినా కాపాడుకుంటామని స్పష్టీకరణ
డామిట్
నక్కపల్లి :
మండలంలో ఏర్పాటు కాబోయే ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ స్టీల్‌ప్లాంట్‌కు భూములు ఇవ్వమని రైతులను ఒప్పించాలని ప్రయత్నించిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు సోమవారం చుక్కెదురైంది. ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఆర్‌డీవో వి.వి.రమణ, ఏపీఐఐసీ ఎస్‌డీసీ అనిత, తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. దీనికి పాత్రికేయులు, ఇతర పార్టీలకు చెందిన రైతులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
కేవలం టీడీపీ సానుభూతిపరులైన అతికొద్ది మంది రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో స్టీల్‌ప్లాంట్‌కు భూములు ఇవ్వాలని రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో సమావేశానికి వచ్చిన పలువురు రైతులు భూములు ఇచ్చే ప్రసక్తి లేదని, సర్వే చేయడానికి వస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు.
ఇదీ నేపథ్యం..
విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా నక్కపల్లి మండలంలో ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా రాజయ్యపేట, చందనాడ, వేంపాడు, డీఎల్‌పురం, అమలాపురం గ్రామాల్లో 4500 ఎకరాలు సేకరించింది. ఈ భూముల్లో 2వేల ఎకరాలు బల్క్‌డ్రగ్ పార్క్ కొరకు కేటాయించింది. మరో 2080 ఎకరాలను ఈ ఏడాది తెరమీదకు వచ్చిన ఆర్సిలర్ మిట్టల్ ీస్టీల్‌ప్లాంట్‌కు ఎకరా రూ.51.39 లక్షల చొప్పున కేటాయించిన విషయం తెలిసిందే. ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ మొదటి విడతలో ఏడాదికి 7.3 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసేందుకు భూములు కేటాయించాలని కోరడంతో ఇటీవలే ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు భూములు కేటాయించింది. అయితే ఈ స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ ఏర్పాటు చేసేందుకు అదనంగా మరో 3265 ఎకరాలు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత రంగంలోకి దిగి, రైతులను ఒప్పించే ప్రయత్నాలు చేపట్టారు. మీరంతా భూములు ఇచ్చి సహకరిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని భూసేకరణకు అడ్డు రావద్దని కోరారు. అయితే తరతరాలుగా ఈ భూములే తమకు ఆధారమని, ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు స్పష్టం చేశారు. సర్వే కోసం భూముల జోలికి వస్తే ప్రాణాలొడ్డి అయినా అడ్డుకుంటామన్నారు. దీంతో సమావేశం ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఖంగుతిన్నారు. ఏం చేయాలో తోచక ఇప్పటికిప్పుడే భూములు సేకరించడం లేదని, నోటిఫికేషన్ విడుదల చేయలేదని, కేవలం ప్రతిపాదనలు మాత్రమేనంటూ సముదాయించుకున్నారు.
రైతులపై ఒత్తిడి పెంచేందుకేనా...!
ఈ సందర్భంగా సమావేశానికి వెళ్లిన పలువురు రైతులు బయటకు వచ్చి స్థానిక ఎమ్మెల్యే అయిన హోంమంత్రి సమావేశం ఏర్పాటు చేయడంతో రైతులకు అండగా నిలుస్తారని ఆశతో వెళ్లామని, కానీ భూములు ఇవ్వాలని ఒప్పించే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులను విభజించి పాలించే ప్రయత్నాలు చేస్తున్నారని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే గ్రామాల్లోకి వచ్చి రైతులతో నేరుగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్న వాదన వినిపిస్తున్నారు.